సిస్టెమా శ్యామ్‌పై ఆర్‌కామ్ కన్ను

సిస్టెమా శ్యామ్‌పై ఆర్‌కామ్ కన్ను


విలీనంపై కొనసాగుతున్న చర్చలు

న్యూఢిల్లీ:
రష్యా టెలికం కంపెనీ ఏఎఫ్‌కే సిస్టెమా భారత వ్యాపార విభాగం సిస్టెమా శ్యామ్‌ను కొనుగోలు చేయడంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) దృష్టి సారించింది. విలీన అవకాశాలపై ఏఎఫ్‌కే సిస్టెమాతో చర్చలు జరుపుతోంది. డీల్ కింద తొమ్మిది టెలికం సర్కిల్స్‌లో సిస్టెమా శ్యామ్ టెలీకి (ఎస్‌ఎస్‌టీఎల్) ఉన్న కస్టమర్లు, స్పెక్ట్రంను ఆర్‌కామ్ కొనుగోలు చేస్తుంది. దీనికి ప్రతిగా షేర్ల రూపంలో ఆర్‌కామ్ చెల్లింపులు జరుపుతుంది. విలీనానంతరం సంస్థలో 10 శాతం వాటా కావాలని ఎస్‌ఎస్‌టీఎల్ కోరుతుండగా, దీన్ని 7-8 శాతానికి పరిమితం చేయాలని ఆర్‌కామ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విలీనం సాకారమైన పక్షంలో దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం కంపెనీగా ఆర్‌కామ్ స్థానం పటిష్టమవుతుంది.



ఎస్‌ఎస్‌టీఎల్ ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు తదితర తొమ్మిది టెలికం సర్కిళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల మార్చిలో జరిగిన స్పెక్ట్రం వేలంలో కంపెనీ పాల్గొనకపోవడంతో భారత్‌లో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ఇతర పోటీ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌కామ్‌తో చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

4జీ సేవలు మెరుగ్గా అందించేందుకు ఉపయోగపడే సీడీఎంఏ స్పెక్ట్రంను ఆర్‌కామ్ 11 సర్వీస్ ఏరియాల్లో దక్కించుకుంది. ఒకవేళ ఎస్‌ఎస్‌టీఎల్ విలీనమైతే మొత్తం 15 టెలికం సర్కిళ్లలో ఆర్‌కామ్‌కు సీడీఎంఏ స్పెక్ట్రం ఉన్నట్లవుతుంది. భారీ ఎత్తున కొత్తగా రాబోయే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్చిలో జరిగిన వేలంలో 11 సర్కిళ్లలో సీడీఎంఏ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మార్చి ఆఖరు నాటికి ఆర్‌కామ్‌కి 10.94 కోట్ల మంది, సిస్టెమా శ్యామ్‌కి 88 లక్షల మంది యూజర్లు ఉన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top