అంతర్జాతీయ మార్కెట్లలో సెలవుల కారణంగా ఎలాంటి సంకేతాలు లేకపోవడం..
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో సెలవుల కారణంగా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో కొత్త ఏడాది ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. గురువారం రోజంతా నష్టాల్లోనే కదలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 27,395-27,546 కనిష్ట, గరిష్టా స్థాయిల మధ్య ట్రేడైంది. చివరికి 8 పాయింట్ల లాభంతో 27,508 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1 పాయింట్ లాభపడి 8,284 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఐదో సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ఐదు సెషన్లలోనూ సెన్సెక్స్ 299 పాయింట్లు లాభపడింది.
2 శాతం పెరిగిన
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మరింతగా తగ్గడంతో పెయింట్ కంపెనీల షేర్లు, విమానయాన ఇంధనం ధర తగ్గడంతో జెట్ ఎయిర్‌వేస్(10 శాతం), స్పైస్‌జెట్(5 శాతం) వంటి విమానయాన రంగ షేర్లు లాభపడ్డాయి. బుధవారం లాభపడిన టెలికం షేర్లు గురువారం కూడా తమ లాభాలను కొనసాగించాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా కంపెనీల షేర్లలో అమ్మకాలు జరిగాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో విలీనం కానున్నదన్న ఊహాగానాలతో ఆంధ్రాబ్యాంక్ 2 శాతం పెరిగింది.
బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్ జరగనున్నదన్న వార్తలతో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లకు డిమాండ్ పెరిగింది. కొనుగోళ్లు మళ్లీ ఊపందుకోవడంతో మైనింగ్, లోహ షేర్లలో జోరు కనిపించింది. కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా సెలవు కావడంతో ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు పనిచేయలేదు.