స్వల్ప నష్టాలు | Sensex closes down 29 points | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాలు

May 4 2017 1:35 AM | Updated on Sep 5 2017 10:19 AM

స్వల్ప నష్టాలు

స్వల్ప నష్టాలు

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల నిర్ణయం నేపథ్యంలో బుధవారం కూడా స్టాక్‌ సూచీలు ఊగిసలాటకు గురయ్యాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి.

26 పాయింట్లు క్షీణించి 29,847కు సెన్సెక్స్‌ ∙
2 పాయింట్ల నష్టంతో 9,312కు నిఫ్టీ


అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల నిర్ణయం నేపథ్యంలో బుధవారం కూడా స్టాక్‌ సూచీలు ఊగిసలాటకు గురయ్యాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 26 పాయింట్లు క్షీణించి 29,847 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 9,312 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, ఆయిల్, గ్యాస్‌ షేర్లు నష్టపోగా, ఐటీ, రియల్టీ షేర్లు లాభపడడం నష్టాలను పరిమితం చేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఒక దశలో 99 పాయింట్లు లాభపడగా, మరో దశలో 75 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ కూడా 33 పాయింట్లు లాభపడగా, 14 పాయింట్లు నష్టపోయింది.

వేచి చూసే ధోరణి...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ప్రారంభమైంది. 30,000 పాయింట్ల పైకి ఎగసింది. కానీ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. యూరోప్‌ మార్కెట్లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. కంపెనీల క్యూ4 ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభించారని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌(రీసెర్చ్‌) వినోద్‌ నాయర్‌ చెప్పారు. రేట్లను యధాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయని, అయితే జూన్‌లో రేట్ల పెంపునకు సంబంధించి సంకేతాలు ఉండొచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది వంద శాతం పెరిగిన స్పైస్‌జెట్‌
స్పైస్‌జెట్‌ షేర్‌ ఇంట్రాడేలో 4 శాతం లాభపడి, జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.117ను తాకింది. చివరకు 3 శాతం లాభంతో రూ.116 వద్ద ముగిసింది.  ఈ ఏడాదిలో ఈ షేర్‌ 104 శాతం లాభపడింది. గత ఏడాది డిసెంబర్‌ 30 నాటికి ఈ షేర్‌ ధర రూ.57గా ఉంది. కాగా అమెరికా ఎఫ్‌డీఏ పరిశీలనల నేపథ్యంలో ఫార్మా షేర్ల నష్టాలు కొనసాగుతున్నాయి. లుపిన్‌ షేర్‌ 2.8 శాతం తగ్గి రూ.1,264కు పడిపోయింది. 2014, ఆగస్టు 26 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి.

మళ్లీ మొదటి స్థానానికి టీసీఎస్‌
అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న భారత కంపెనీగా ఐటీ దిగ్గజం టీసీఎస్‌ తన స్థానాన్ని రెండో రోజు కూడా నిలుపుకుంది. రూ.4,60,568 కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో టీసీఎస్‌ అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ కంటే టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌రూ.15,054 కోట్లు అధికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement