ఒడిదుడుకులు... అయినా లాభాల్లోనే!!

Sensex closes 42 points higher at 40,487, Nifty at 11,937 - Sakshi

పరిమిత శ్రేణిలోనే కదలాడిన సూచీలు

గణాంకాల వెల్లడి దృష్ట్యా ఆచితూచి ట్రేడింగ్‌

42 పాయింట్ల లాభంతో 40,487కు సెన్సెక్స్‌

11,937 వద్ద ముగిసిన నిఫ్టీ, 16 పాయింట్ల లాభం

ముంబై: దేశీయ ప్రధాన స్టాక్‌ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి.  అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఉదయం సెన్సెక్స్‌ 65 పాయింట్ల లాభంతో 40,510 వద్ద ప్రారంభమైంది. ఆ తరువాత కొనసాగిన లాభాల స్వీకరణతో కనిష్టంగా 40,337 పాయింట్లకు పడిపోయింది. మధ్యాహ్నం మళ్లీ కోలుకుని గరిష్టంగా 40,646 పాయింట్లకు చేరినప్పటికీ.. నిరాశపరిచిన ఇటీవలి క్యూ2 జీడీపీ గణాంకాల నేపథ్యంలో ప్రీమియం వాల్యుయేషన్స్‌ వద్ద మార్కెట్‌ నిలబడే అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయనే అనుమానాలు లాభాల స్వీకరణకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌ 42 పాయింట్ల లాభంతో 40,487 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,937 వద్ద ముగిశాయి.

7.5 శాతం పెరిగిన వీఐఎక్స్‌
మార్కెట్లో రానున్న 30 రోజుల ఒడిదుడుకులను ప్రతిబింబించే ఇండియా వీఐఎక్స్‌ సూచీ సోమవారం ఒక్కసారిగా 7.5 శాతం పెరిగి 14.59 స్థాయికి చేరుకుంది.  ఈ సూచీ కదలికల ఆధారంగా రానున్న రోజుల్లో ఒడిదుడుకులకు మరింత ఆస్కారం ఉందని రిలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వీపీ అజిత్‌ మిశ్రా విశ్లేíషించారు.  

బలపడిన రూపాయి.. ఐటీ షేర్లు డీలా
డాలరుతో రూపాయి బలపడిన కారణంగా నిఫ్టీ ఐటీ 0.87 శాతం నష్టపోయింది. ఈ సూచీలోని టీసీఎస్‌ షేరు అత్యధికంగా 2.99 శాతం నష్టపోగా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1.62 శాతం, టెక్‌ మహీంద్ర 0.86 శాతం నష్టపోయాయి. మరోవైపు హెక్సావేర్, ఎన్‌ఐఐటీ షేర్లు ఒక శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఆటో 0.73 శాతం లాభం..
మారుతీ సుజుకీ నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని 4.33 శాతం పెంచినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ కంపెనీ షేరు 2 శాతం మేర లాభపడింది. ఈ సానుకూల అంశంతో ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎంఆర్‌ఎఫ్, ఆశోక్‌ లేలాండ్, ఎం అండ్‌ ఎం, హీరో మోటోకార్ప్, బజాజ్‌ ఆటో షేర్లు 0.45 శాతం నుంచి 1.41 శాతం మధ్యలో లాభపడ్డాయి.

వోడాఫోన్‌ ఐడియా 5.80 శాతం డౌన్‌
ప్రభుత్వ సాయం లేకపోతే వ్యాపారాన్ని మూసివేస్తామని వోడాఫోన్‌ ఐడియా చైర్మన్‌ కుమార మంగళం బిర్లా చేసిన వ్యాఖ్యలతో ఈ కంపెనీ షేరు 5.8 శాతం నష్టంతో రూ. 6.50 వద్ద ముగిసింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 4.75 శాతం నష్టపోగా.. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 7.88 శాతం నష్టపోయింది.  

డిష్‌ టీవీ 6.37 శాతం అప్‌
అంతర్గత సమీకరణల ద్వారా తన అప్పులలో అధిక భాగాన్ని చెల్లిస్తామని డిష్‌ టీవీ ప్రకటించటంతో ఈ కంపెనీ షేరు 6.37 శాతం లాభపడింది. ఆకర్షణీయ రెవెన్యూ గైడెన్స్‌తో వా టెక్‌ వాబాగ్‌ 15.38 శాతం లాభపడింది.  కాగా నిఫ్టీ–50 షేర్లలో బీపీసీఎల్, యాక్సిస్‌ బ్యాంక్, ఆదాని పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ అత్యధికంగా 2 శాతం మేర లాభపడ్డాయి.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top