స్టార్టప్‌లకు సెబీ జోష్‌..

SEBI allows side-pocketing in mutual funds - Sakshi

నిబంధనల సరళీకరణ...

ఓఎఫ్‌ఎస్‌ నిబంధనల్లోనూ మార్పులు

సెబీ బోర్డ్‌ కీలక నిర్ణయాలు

ముంబై: సంస్కరణల్లో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టార్టప్‌ల అభివృద్ధి కోసం లిస్టింగ్‌ నిబంధనలను సరళీకరించింది. పెట్టుబడుల రాబడుల రక్షణ కోసం ఒత్తిడి ఆస్తులను విడగొట్టే వెసులుబాటును మ్యూచువల్‌ ఫండ్స్‌కు కల్పించింది. లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రమోటర్లు తమ వాటాను తగ్గించుకోవడానికి ఉపయోగించుకునే ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానాన్ని విస్తరించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరిమితి నిబంధనలను సరళీకరించింది. బుధవారం జరిగిన కీలక బోర్డ్‌  సమావేశంలో సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లో సంస్థాగత ఇన్వెస్టర్లు మరిం త అధికంగా పాలుపంచుకునేందుకు గాను కస్టోడియల్‌ సర్వీసెస్‌ను అనుమతించాలని కూడా సెబీ నిర్ణయించింది.  

స్టార్టప్‌ నిబంధనలు సడలింపు
 ఈ–కామర్స్, డేటా ఎనలిటిక్స్, బయోటెక్నాలజీ వంటి కొత్త తరం స్టార్టప్‌లు నిధుల సమీకరణ, లిస్టింగ్‌నకు సంబంధించిన నిబంధనలను సెబీ సరళీకరించింది. స్టార్ట్లప్‌ల లిస్టింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ పేరును.ఇన్‌స్టిట్యూషనల్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ నుంచి ఇన్నోవేటర్స్‌ గ్రోత్‌ ప్లాట్‌ఫార్మ్‌గా మార్చింది.  ప్రస్తుతం టాప్‌ 200 కంపెనీలకే వర్తిస్తున్న ఓఎఫ్‌ఎస్‌ నిబంధనలు రూ.1,000 కోట్లు, అంతకు మించిన మార్కెట్‌ క్యాప్‌ ఉన్న అన్ని కంపెనీలకూ వర్తిస్తాయని సెబీ పేర్కొంది.   

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ‘మొండి’ ఆస్తులు వేరు 
మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి సెబీ తదుపరి సంస్కరణలకు పూనుకుంది. ఇటీవలే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో చెల్లింపుల సంక్షోభం తలెత్తడం తెలిసిందే. ఫలితంగా ఆ సంస్థ జారీ చేసిన డెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్‌ ఫండ్స్‌... ఆ మేరకు రైటాఫ్‌ చేయాల్సిన పరిస్థితి ఎదురుకావటం తెలిసిందే. ఈ తరహా సందర్భాల్లో ఒత్తిడితో కూడిన డెట్, మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్స్‌కు సంబంధించిన పోర్ట్‌ఫోలియోలను వేరు చేయడానికి అనుమతించాలని సెబీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇలా ఒత్తిడితో కూడిన, లిక్విడిటీ లేని ఆస్తులను వేరు చేయడం వల్ల.... అదే సమయంలో లిక్విడ్‌ ఆస్తుల రాబడులకు విఘాతం కలగకుండా చూడొచ్చన్నది సెబీ ఆలోచన. దీంతో లిక్విడిటీ ఉన్న ఆస్తులను ఒక కిట్టీగా, సంక్షోభంలో పడి లిక్విడిటీ ఒత్తిళ్లు ఉన్న పెట్టుబడులు మరో కిట్టీగా వేరు చేయడం జరుగుతుంది. దీనివల్ల లిక్విడిటీ లేని ఆస్తుల విక్రయానికి ఎవరికీ అవకాశం ఉండదు. అదే సమయంలో లిక్విడిటీ ఉన్న ఆస్తులను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. డెట్, మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లకు సంబంధించి వాల్యుయేషన్‌ నిబంధనలను సమీక్షించే ప్రతిపాదనకు కూడా సెబీ పరిగణనలోకి తీసుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top