Sebi : ఫండ్స్‌లో సిబ్బంది ఇన్వెస్ట్‌ చేయాలి

Amc Junior Staff Investment Mandatory In Mutual Funds Says Sebi - Sakshi

న్యూఢిల్లీ: ఆస్తుల నిర్వహణ కంపెనీ(ఏఎంసీ)ల జూనియర్‌ స్థాయి సిబ్బంది ఇకపై మ్యూచువల్‌ ఫండ్స్‌లో తప్పనిసరిగా ఇన్వెస్ట్‌ చేయవలసి ఉంటుంది. స్థూల వేతనాలలో కనీసం 20 శాతాన్ని దశల వారీగా పెట్టుబడులకు కేటాయించవలసి వస్తుంది. ఆఫీసర్‌స్థాయి ఉద్యోగులైతే జీతాలలో 20 శాతాన్ని తప్పనిసరిగా ఫండ్స్‌కు మళ్లించవలసి ఉంటుంది. 2021–2023 అక్టోబర్‌ నుంచి తాజా నిబంధనలు వర్తించనున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సర్క్యులర్‌ను జారీ చేసింది.  

తొలుత ఇలా.. 
ఏఎంసీల జూనియర్‌స్థాయి సిబ్బంది తొలుత వేతనాలలో 10 శాతాన్ని ఫండ్‌ హౌస్‌ యూనిట్లలో ఇన్వెస్ట్‌ చేయవలసి ఉంటుంది. ఈ ఏడాది(2021) అక్టోబర్‌ 1నుంచి ఇది అమలుకానుంది. ఈ బాటలో 2022 అక్టోబర్‌ నుంచి 15 శాతం, 2023 అక్టోబర్‌ 1 నుంచి 20 శాతం వేతనాన్ని సంస్థకు చెందిన మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల కోసం వెచ్చించవలసి ఉంటుంది. ఇక 2023 అక్టోబర్‌ 1 నుంచి జూనియర్‌ ఉద్యోగులందరూ 20 శాతం వేతనాన్ని ఫండ్స్‌లో పెట్టుబడులకు వినియోగించవలసి వస్తుంది.  

అధికారుల పెట్టుబడులు 
ఏఎంసీలలో పనిచేసే 35 ఏళ్లకంటే తక్కువ వయసుగల ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగులను జూనియర్‌ సిబ్బందిగానే పరిగణించనున్నారు. అయితే ఈ జాబితా నుంచి సీఈవో, ఏదైనా విభాగానికి అధిపతి, ఫండ్‌ మేనేజర్లను మినహాయిస్తారు. 35ఏళ్ల వయసు అందుకున్న జూనియర్‌ ఉద్యోగులకు దశలవారీ పెట్టుబడుల నిబంధన వర్తించదు. కాగా.. నిబంధనల స్థూల ఉల్లంఘన, మోసం, నిర్లక్ష్యం తదితర పరిస్థితుల్లో ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగుల యూనిట్లను కంపెనీ వెనక్కి తీసుకుంటుంది. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ప్రతినిధులు, మ్యూచు వల్‌ ఫండ్స్‌ సలహా కమిటీ సూచనల నేపథ్యంలో సెబీ పలు అంశాలపై స్పష్టతనిచ్చింది. తాజా నిబంధనలు ఏఎంసీ కంపెనీలకు చెందిన కీలక ఉద్యోగులందరికీ వర్తించనున్నాయి. ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో భాగమున్న ఉద్యోగులందరూ నిబంధనల పరిధిలోకి రానున్నారు. ఫండ్‌ మేనేజర్స్, రీసెర్చ్‌ బృందాలు, డీలర్లు తదితరులకు నిబంధనలు వర్తించనున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ పథకా ల యూనిట్‌దారులతో కంపెనీ ఉద్యోగులను అనుసంధానం చేసే లక్ష్యంతో సెబీ తాజా నిబంధనలను ప్రవేశపెట్టినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

3 ఏళ్ల లాకిన్‌
ఫండ్‌ హౌస్‌ యూనిట్లలో ఇన్వెస్ట్‌ చేసిన ఉద్యోగులకు పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్‌ వర్తిస్తుంది. తదుపరి కొత్త పెట్టుబడులకు మారుగా వీటిని మరో మూడేళ్లు కొనసాగించుకోవచ్చు. అయితే తిరిగి మూడేళ్ల లాకిన్‌ గడువు లేదా పథకం గడువు వర్తించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top