కేంద్రానికి రూ.14,000 కోట్ల ఈటీఎఫ్‌ నిధులు!

Rs 14,000 crore ETF funds to Center - Sakshi

వచ్చే వారం నాలుగో విడత సీపీఎస్‌ఈ ఇష్యూ ప్రారంభం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం సీపీఎస్‌ఈ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ నాలుగో విడత జారీ ద్వారా రూ.14,000 కోట్లను సమీకరించనున్నట్టు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. గత మూడు విడతల జారీల్లో కేంద్ర మొత్తం మీద రూ.11,500 కోట్ల మేర సమీకరించింది. నాలుగో విడత ఇష్యూ వచ్చే వారం ప్రారంభం అవుతుందని, ఇన్వెస్టర్లకు 3.5–4 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ప్రభుత్వం రూ.8,000 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోందని, అవసరమైతే రూ.4,000– 6,000 కోట్ల మేర అదనంగా సమీకరించే గ్రీన్‌ షూ ఆప్షన్‌ కూడా కలిగి ఉంటుందని తెలిపాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో కూడిన ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ ఇది. ఇందులో గతంలో 10 కంపెనీలు ఉండగా తాజాగా వీటి సంఖ్య 11కు చేరింది. కొత్తగా ఎన్‌టీపీసీ, ఎస్‌జేవీఎన్, ఎన్‌ఎల్‌సీ, ఎన్‌బీసీసీ వచ్చి చేరాయి.

ఇప్పటికే ఉన్న గెయిల్, ఇంజనీర్స్‌ ఇండియా, కంటెయినర్‌ కార్పొరేషన్‌ను ఇండెక్స్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 55 శాతం లోపునకు తగ్గిపోవడంతో ఈ చర్య తీసుకుంది. ఇక సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో మిగిలిన ఇతర కంపెనీలు... ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఐవోసీ, ఆయిల్‌ ఇండియా, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌. దీన్ని తొలిసారిగా 2014లో కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణలతో రూ.80,000 కోట్లు సమీకరించాలన్నది సర్కారు లక్ష్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top