అనిల్‌ అంబానీని జైల్లో పెట్టండి!! 

RCom files case in Supreme Court against DoT over Jio deal - Sakshi

విదేశాలకు వెళ్లకుండా ఆదేశాలివ్వండి

మా బాకీల చెల్లింపులో మళ్లీ మళ్లీ డిఫాల్టవుతున్నారు

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎరిక్‌సన్‌  

న్యూఢిల్లీ: దాదాపు 550 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడంలో పలుమార్లు విఫలమైన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) చీఫ్‌ అనిల్‌ అంబానీపై స్వీడన్‌ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ బాకీలు చెల్లించడంలో డిఫాల్ట్‌ అవుతున్న ఆయన్ను కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుకు పంపాలని, బాకీలు చెల్లించేదాకా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఒక ఆంగ్ల ఫైనాన్షియల్‌ డెయిలీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆర్‌కామ్‌ జరపాల్సిన చెల్లింపులకు సంబంధించి అనిల్‌ అంబానీ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో దీని ఆధారంగానే ఎరిక్సన్‌ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు, స్పెక్ట్రం విక్రయాన్ని జాప్యం చేయడంపై టెలికం శాఖపై (డాట్‌) ఆర్‌కామ్‌ కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది.

స్పెక్ట్రం విక్రయంలో డాట్‌ జాప్యం చేయకుండా ఉండి ఉంటే ఎరికన్స్, ఇతర రుణదాతల బకాయిలు తీర్చేసేందుకు ఉపయోగకరంగా ఉండేదని పేర్కొంది. ఈ రెండు పిటీషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. ‘ఆర్‌కామ్‌తో పాటు తత్సంబంధిత వర్గాలు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో తాజాగా మరో పిటిషన్‌ వేయాల్సి వచ్చింది. మేం చాలా కాలంగా బాకీల చెల్లింపు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ వారు చెల్లించకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. కోర్టు ఆదేశాల ధిక్కరణ రుజువైన పక్షంలో ఆరు నెలల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది‘ అని ఎరిక్సన్‌ తరఫు న్యాయవాది అనిల్‌   ఖేర్‌ తెలిపారు.
 
స్పెక్ట్రం విక్రయంపై ఆర్‌కామ్‌ ఆశలు.. 
ఎరిక్సన్‌కు రూ.550 కోట్ల బకాయిలు చెల్లించడంలో ఆర్‌కామ్‌ విఫలం కావడం ఇది రెండోసారి. తొలిసారి డిఫాల్ట్‌ అయిన తర్వాత ఆర్‌కామ్‌కు సుప్రీం కోర్టు మరో అవకాశం ఇచ్చింది. డిసెంబర్‌ 15లోగా ఏటా 12 శాతం వడ్డీ రేటుతో బాకీలు చెల్లించాలని ఆదేశించింది. కానీ ఆర్‌కామ్‌ రెండో సారి కూడా విఫలమైంది. మరో టెలికం సంస్థ రిలయన్స్‌ జియోకు వైర్‌లెస్‌ స్పెక్ట్రంను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణదాతలకు బకాయిలు చెల్లించేయాలని ఆర్‌కామ్‌ ఆశిస్తోంది. అయితే, ఆర్‌కామ్‌ బాకీలకు బాధ్యత వహించడానికి జియో సిద్ధంగా లేనందున కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్పెక్ట్రం డీల్‌కు అనుమతించలేమంటూ డిసెంబర్‌ నెలలో టెలికం శాఖ తోసిపుచ్చింది.

ఈ పరిణామాల దరిమిలా ఆర్‌కామ్, ఎరిక్సన్‌ వివాదం మరోమారు కోర్టుకెక్కింది.  మరోవైపు, ఇరు కంపెనీల మధ్య స్పెక్ట్రం డీల్‌కు సంబంధించిన ప్రక్రియపై స్పష్టతనివ్వాలంటూ రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కలిసి కేంద్ర టెలికం శాఖకు లేఖ రాసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రంనకు సంబంధించిన బకాయీలను తీర్చే బాధ్యత ఆర్‌కామే తీసుకుంటోందని జియో తెలిపినట్లు వివరించాయి. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్‌తో స్పెక్ట్రం ట్రేడింగ్‌ ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము సిద్ధమేనని జియో స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. స్పెక్ట్రం విక్రయం ద్వారా రిలయన్స్‌ జియో నుంచి వచ్చే రూ. 975 కోట్లలో ఎరిక్సన్‌కు రూ. 550 కోట్లు, మైనారిటీ వాటాదారైన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌కు రూ. 230 కోట్ల బకాయిలు చెల్లించాలని              ఆర్‌కామ్‌ యోచిస్తోంది.   

వివాదమిదీ..  
దేశవ్యాప్తంగా ఆర్‌కామ్‌ టెలికం నెట్‌వర్క్‌ నిర్వహణకు సంబంధించి 2014లో ఎరిక్సన్‌ ఏడేళ్ల కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే, 2016 నుంచి చెల్లింపులు నిల్చిపోవడంతో సెప్టెంబర్‌ 2017లో ఆర్‌కామ్‌తో పాటు ఆ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్, రిలయన్స్‌ టెలికంలపై ఎరిక్సన్‌.. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా పిటిషన్‌ వేసింది. ఆర్‌కామ్‌ నుంచి తమకు రూ. 978 కోట్లు రావాలని, నోటీసులిచ్చినా చెల్లింపులు జరపకపోవడంతో ఇది రూ.1,600 కోట్లకు పెరిగిందని ఎరిక్సన్‌ పేర్కొంది. అయితే, దీనిపై నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆర్‌కామ్‌ ఆశ్రయించగా.. దివాలా చర్యలపై స్టే విధించింది. సెటిల్మెంట్‌ ఒప్పందం ప్రకారం సెప్టెంబర్‌ ఆఖరు నాటికి ఎరిక్సన్‌కు రూ.550 కోట్లు కట్టాలని ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. కానీ, గడువులోగా ఆర్‌కామ్‌ కట్టకపోవడంతో ఎరిక్సన్‌ మళ్లీ కోర్టుకెళ్లింది. దీంతో ఈసారి న్యాయస్థానం డిసెంబర్‌ 15 దాకా గడువిచ్చింది.

ఆర్‌కామ్‌ ఈసారి కూడా డిఫాల్ట్‌ కావడంతో ఎరిక్సన్‌ మళ్లీ కోర్టునాశ్రయించింది. ప్రస్తుతం ఆర్‌కామ్‌ రుణ భారం రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉంది. అనిల్‌ అంబానీ ప్రణాళిక ప్రకారం రిలయన్స్‌ జియో తదితర సంస్థలకు ఆర్‌కామ్‌ అసెట్స్‌ విక్రయానంతరం ఇది సుమారు రూ.6,000 కోట్లకు తగ్గవచ్చని అంచనా. అయితే, స్పెక్ట్రం ట్రేడింగ్‌కు సంబంధించి టెలికం శాఖ నుంచి అనుమతులు వీటికి కీలకం. ఆర్‌కామ్‌ ప్రభుత్వానికి కట్టాల్సిన స్పెక్ట్రం బకాయిలకు రిలయన్స్‌ జియో బాధ్యత వహించడానికి ఇష్టపడకపోవడంతో.. డాట్‌ నుంచి అనుమతులు రావడం లేదు. న్యాయస్థానం ఆదేశాలున్నా డాట్‌ కావాలనే జాప్యం చేస్తోందని, దీనివల్ల తాము రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల అన్ని వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్‌కామ్‌ వాదిస్తోంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top