మూడు నెలల్లో రెండు రైల్వే ఐపీఓలు!

Railways to lose investment guarantee from World Bank due to IRFC IPO - Sakshi

మూడు నెలల్లో ముగియనున్న  ఆర్థిక సంవత్సరం

డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్య సాధనకు  ప్రభుత్వం యత్నాలు

దీన్లో భాగంగా రైల్వే వికాస్‌ నిగమ్‌ ద్వారా రూ.500 కోట్లు

ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరణ!!  

ముంబై: రైల్వేలకు చెందిన రెండు అనుబంధ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వచ్చే అవకాశాలున్నాయి. వచ్చే మూడు నెలల్లో రైల్వేకి చెందిన ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ), రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) ఐపీఓలను తేవాలని, ఈ రెండు కంపెనీల్లో కనీసం పది శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్‌వీఎన్‌ఎల్‌ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు, ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓ ద్వారా  రూ.1,000 కోట్ల వరకూ నిధులు సమీకరించే అవకాశముంది. మరోవైపు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉండొచ్చని అంచనా. 

ఇప్పటికే రెండు రైల్వే ఐపీఓలు... 
ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటిదాకా (గత నెల 11 నాటికి) రూ.34,000 కోట్ల మేర మాత్రమే సమీకరించగలిగింది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో మూడు నెలల్లో రూ.46,000 కోట్లు సమీకరించాలి. దీంతో ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను ఫాలో ఆన్‌ ఆఫర్ల (ఎఫ్‌పీఓ) ద్వారా విక్రయించడం, ఇంతవరకూ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కాని ప్రభుత్వ రంగ సంస్థలను ఐపీఓకు అనుమతించడం దీంట్లో భాగమే. రైల్వేల నుం చి ఇప్పటికే రైట్స్, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ ఐపీఓలు వచ్చాయి. వీటికి ఇన్వెస్టర్ల నుంచి స్పందన బాగానే ఉంది. రైట్స్‌ ఐపీఓ 67 రెట్లు, ఇర్కాన్‌ ఐపీఓ 10 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ రెండు కంపెనీలు చెరో రూ.466 కోట్ల మేర సమీకరించాయి.  

ఆర్‌వీఎన్‌ఎల్‌ ఇష్యూ సైజు రూ.500 కోట్లు... 
హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్ట్‌లకు కావలసిన మౌలిక సదుపాయాల నిర్మాణానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా (ఎస్‌పీవీ) రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఐపీఓకు రావడానికి ఇప్పటికే ఈ కంపెనీ సెబీ నుంచి ఆమోదం పొందింది. ఐపీఓలో భాగంగా 10 శాతం వాటాకు సమానమైన 2.08 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది.  

ఆకర్షణీయ రైల్వే కంపెనీ.. ఐఆర్‌ఎఫ్‌సీ... 
ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) రూ.6,392 కోట్ల పన్ను బాధ్యతను కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది ఆరంభంలోనే రద్దు చేసింది.  ఈ పన్ను బాధ్యత రద్దు వల్ల ఐఆర్‌ఎఫ్‌సీ నెట్‌వర్త్‌ పెరిగింది. దీంతో నెట్‌వర్త్‌కు పది రెట్ల రుణాన్ని సమీకరించే వెసులుబాటు ఈ కంపెనీకి లభించింది. ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా రూ.1,000 కోట్ల మేర నిధులు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రైల్వే అనుబంధ కంపెనీల కంటే ఐఆర్‌ఎఫ్‌సీయే అత్యంత ఆకర్షణీయ కంపెనీ అని, మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ ఐపీఓకు మంచి స్పందన ఉండగలదని అంచనా. 2018, మార్చినాటికి ఈ కంపెనీ ఆస్తులు 1.52 లక్షల కోట్లు. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో  ఐఆర్‌సీటీసీ ఐపీఓ 
ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఐపీఓ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉండాలని ఆర్థిక శాఖ వర్గాలు పట్టుబట్టాయి. అయితే వేల్యూయేషన్‌ సంబంధిత సమస్యల కారణంగా  వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐపీఓ ఉంటుందని రైల్వే మంత్రి గోయల్‌ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌పై సర్వీస్‌ చార్జీని ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఈ కంపెనీకి ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం తగ్గిందని అంచనా. దీంట్లో రూ.80 కోట్లే ఆర్థిక శాఖ సర్దుబాటు చేయగలిగింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ స్థూల లాభం 3 శాతం వృద్ధితో రూ.341 కోట్లకు చేరింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో ప్రకటనలను అనుమతించడం, డేటా మానిటెజేషన్, ఈ–ఆక్షనింగ్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ కారణంగా ఈ స్థాయి లాభం వచ్చింది. రైల్‌ నీర్‌ కారణంగా ఆదాయంలో 4.2 శాతం, కేటరింగ్‌ వ్యాపారం కారణంగా ఆదాయంలో 22 శాతం పెరుగుదల నమోదైందని రైల్వే ఉన్నతాధికారొకరు చెప్పారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top