చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం

Piyush Goyal warns consultants not to mislead investors - Sakshi

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హెచ్చరిక

తప్పుడు సలహాలు ఇవ్వొద్దని అకౌంటింగ్‌ సంస్థలకు సూచన

తప్పు చేయని వారికి సమస్యలు ఉండవని భరోసా

న్యూఢిల్లీ: చట్ట స్ఫూర్తిని ఉల్లంఘించొద్దని పరిశ్రమకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హితవు పలికారు. రౌండ్‌ ట్రిప్పింగ్‌ (ఒకరి నుంచి ఒకరు చేతులు మార్చుకోవడాన్ని) వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ‘‘ఏ తప్పూ చేయని వారికి ఎటువంటి సమస్య ఉండదని నేను భరోసా ఇస్తున్నాను. కానీ, అదే సమయంలో తప్పుడు పనుల్లో పాల్గొనే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. దేశ సంస్కృతి, మైండ్‌సెట్‌ను మార్చేస్తాం’’ అని పీయూష్‌ గోయల్‌ సీఐఐ సభ్యులతో సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు.

న్యాయవాదులు, అంతర్జాతీయంగా నాలుగు అతిపెద్ద ట్యాక్స్‌ కన్సల్టెన్సీ సంస్థలు (పీడబ్ల్యూసీ, డెలాయిట్, కేపీఎంజీ, ఈఅండ్‌వై) ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. భారత చట్ట స్ఫూర్తికి విరుద్ధమైన సలహాలు ఇవ్వొద్దని పరోక్షంగా హెచ్చరించారు. బహుళ బ్రాండ్ల ఉత్పత్తుల రిటైల్‌ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) చట్టాన్ని కంపెనీలు గౌరవించాలని, లొసుగుల ద్వారా దీన్నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దని హితవు పలికారు.

చట్టానికి అనుగుణంగా...
‘‘మల్టీ బ్రాండ్‌ రిటైల్‌లో 51 శాతం వరకు ఎఫ్‌డీఐని అనుమతించే విధానం అమల్లో ఉంది. దీనికి కట్టుబడి ఉన్నాం. ప్రతీ ఒక్కరూ దీన్ని అనుసరించాలి, గౌరవించాలి. చట్టానికి అనుగుణంగా ఉన్నంత వరకు సమస్య ఏమీ ఉండదు’’ అని మంత్రి పేర్కొన్నారు.  చట్టానికి అనుగుణంగా నడచుకోండి. రౌండ్‌ ట్రిప్పింగ్‌ను చట్టం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. మీలో ఎవరైనా అది చేసుంటే అంగీకరించి ప్రక్షాళన చేసుకుని, ఆ అధ్యాయానికి ముగింపు పలకండి’’ అని మంత్రి సూచించారు. దొడ్డిదారిన వచ్చిన వారు బయటపడే మార్గం కోసం కామా, పుల్‌స్టాప్‌లను వెతకొద్దన్నారు. ఆసియాన్‌ దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై గోయల్‌ స్పందిస్తూ... చట్టంలో కొన్ని నిబంధనలు భారంగా ఉన్నాయని, వాటిని సభ్యదేశాల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

ఎగుమతిదారులకు విదేశీ మారక రుణాలు
ఎగుమతిదారులకు విదేశీ మారక రూపంలో రుణాలను సమకూర్చే విషయంలో బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఖజానాపై పెద్దగా భారం పడకుండా, ఖరీదైన రుణ సమస్యను పరిష్కరించే మార్గాలున్నాయని చెప్పారు. వాణిజ్యానికి సంబంధించి ఏ అంశానికైనా సబ్సిడీలన్నవి పరిష్కారం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా విదేశీ కరెన్సీ రుణాలు సమకూర్చనున్నామని, బ్యాంకులతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఈ విషయం లో ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (ఈసీజీసీ) కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రాల పన్నులను ఎగుమతిదారులకు తిరిగి చెల్లించే విషయాన్ని  పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 50 బిలియన్‌ డాలర్ల ఎగుమతులకు అవకాశాలున్నాయని వాణిజ్య శాఖ మదింపు వేసినట్టు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top