వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లోకి పేటీఎం! | Sakshi
Sakshi News home page

వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లోకి పేటీఎం!

Published Thu, Jan 11 2018 12:16 AM

Paytm into Wealth Management! - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఈ– కామర్స్‌ సంస్థ పేటీఎం.. పెట్టుబడులు, ఆర్ధిక నిర్వహణ విభాగం(వెల్త్‌ మేనేజ్‌మెంట్‌)లోకి అడుగుపెట్టనుంది. అనుమతుల కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నామని.. ఈ ఏడాది తొలి త్రైమాసికం లోపు విపణిలోకి తొలి ఉత్పత్తులను ప్రవేశపెడతామని పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ ట్వీటర్‌లో తెలిపారు. ముందుగా మ్యుచువల్‌ ఫండ్స్‌ ఉత్పత్తులను విక్రయించనుంది.

ఇప్పటికే పలు ప్రముఖ 10–12 అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ)లతో చర్చిస్తున్నట్లు శేఖర్‌ తెలిపారు. పేటీఎం బ్రాండ్‌ను వన్‌97 కమ్యూనికేషన్స్‌ నిర్వహిస్తోంది. ప్రస్తుతం దీనికి పేటీఎం వాలెట్, మాల్, పేమెంట్‌ బ్యాంక్‌ మూడు అనుబంధ సంస్థలున్నాయి. ఇప్పుడిది నాల్గోది. ఇప్పటివరకు పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్, సైఫ్‌ పార్టనర్స్, అలీబాబా, ఏఎన్‌టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పెట్టుబడులు పెట్టాయి.  

రూ.63 కోట్ల పెట్టుబడులు..
పేటీఎం మనీలో రూ.63 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిసింది. పేటీఎం మనీకి ప్రవీణ్‌ జాదవ్‌ సీనియర్‌ హెడ్‌గా వ్యవహరించనున్నారు. గతంలో ఆయన రెడిఫ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్స్‌లో పనిచేశారు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ విష్‌బర్గ్‌ వ్యవస్థాపకులు ఈయనే. బెంగళూరు కేంద్రంగా పనిచేసే పేటీఎం మనీలో ఇప్పటివరకు 40 మంది ఉద్యోగులను నియమించుకున్నారు.

మరో 6 నెలల్లో 200 మందిని నియమించుకోనున్నట్లు జాదవ్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 40కి పైగా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలుండగా.. ఇవన్నీ అర్బన్‌ మార్కెట్లకే పరిమితమయ్యాయని.. పేటీఎం మనీ మాత్రం గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై దృష్టిసారిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement