సొంతింటికి దగ్గరి దారి! | Sakshi
Sakshi News home page

సొంతింటికి దగ్గరి దారి!

Published Fri, Jan 22 2016 10:51 PM

సొంతింటికి దగ్గరి దారి!

సొంతిల్లు.. అదీ భాగ్యనగరంలో! ఎంతలేదన్నా పాతిక లక్షలు పెడితే గానీ దొరకని పరిస్థితి. కానీ, రూ.17 లక్షలకే ఇండిపెండెంట్ హౌజ్.. అది కూడా స్థిరాస్తి రంగంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న షాద్‌నగర్ పట్టణంలో!! షాద్‌నగర్ అభివృద్ధికి బీజం పడింది 2002లోనే. సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్ గేట్స్ సందర్శించిన నాటి నుంచే ఈ పట్టణం పేరు ప్రపంచ స్థాయిలో మార్మోగిందనేది నిపుణుల మాట. తాజాగా తెలంగాణ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానంతో అంతర్జాతీయ కంపెనీల దృష్టి ఇక్కడే పడింది.
 
 సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో ఫలూక్‌నగర్, కొత్తూరు, కొందుర్గ్, కేశంపేట ప్రాంతాలొస్తాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే 44వ నంబర్ జాతీయ రహదారి షాద్‌నగర్ మీదుగానే వెళుతుంది. హైదరాబాద్ నుంచి 48 కి.మీ. దూరం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 22 కి.మీ. దూరంలో ఉందీ పట్టణం. రైలు, బస్సు వంటి రవాణా సౌకర్యాలకూ కొదవేలేదు. మౌలిక వసతులు మెరుగ్గా ఉండటం.. స్థిరాస్తి ధరలూ అందుబాటులోనే ఉండటంతో కొనుగోలు, పెట్టుబడిదారులు ఇద్దరి దృష్టిని ఆకర్షిస్తోంది షాద్‌నగర్.
 
 ధరలూ అందుబాటులోనే..
 ప్రస్తుతమిక్కడ డీఎల్‌ఎఫ్, స్పేస్ విజన్, గిరిధారి, సువర్ణ భూమి ఇలా పలు నిర్మాణ సంస్థలు భారీ గేటెడ్ కమ్యూనిటీలు, వెంచర్లను వేశాయి. స్థలం ఎకరం ధర రూ.60-80 లక్షలు చెబుతున్నారు. మెయిన్ రోడ్డు నుంచి కాస్త లోపలికి వెళితే రూ.45-50 లక్షల్లోపూ దొరుకుతున్నాయి. ఇక ఫ్లాట్ల ధరలు చూస్తే.. చ.అ. ధర రూ.2,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించడంతో ఇప్పుడిక్కడ ధరలకు రెక్కలొచ్చాయి. ఏటా 25-30 శాతం ధరలు పెరిగే అవకాశముందని, అందుకే స్థిరాస్తి కొనుగోలుకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు.
 
 పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి..
 షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణ పారిశ్రామిక విధానం తర్వాత సుమారు 13 కంపెనీల నుంచి రూ.900 కోట్ల మేర పెట్టుబడులు ఇక్కడికొచ్చాయి.
 
గతంలో కేంద్రం ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్ట్‌ను మరింతగా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీఐఆర్ స్థాపనకు 200 ఎకరాలు చూపిస్తే ప్రాజెక్ట్‌ను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఆ దిశగా పాలమూరు జిల్లా అధికారులు దృష్టి పెట్టారు. జిల్లా మీదుగా జాతీయ రహదారి, రైల్వే లైను, సరిహద్దులో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, షాద్‌నగర్ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండటం వంటివి జిల్లాకు కలిసొచ్చే అంశాలు. బాలానగర్ నుంచి కొత్తూరు ప్రాంతాల్లో భూములపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.
 
 అమెజాన్ సంస్థ కొత్తూరులో 2.80 లక్షల చ.అ.ల్లో భారీ గిడ్డంగిని ఏర్పాటు చేసింది. ఇక్కడే పీఅండ్‌జీ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా మూడేళ్లలో సుమారు రూ.3 వేల కోట్లతో అతిపెద్ద సబ్బుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడే జాన్సన్ అండ్ జాన్సన్ మరో రూ.4 వేల కోట్లతో 40 ఎకరాల్లో ప్లాంటును విస్తరించనుంది.
 వేములలో కోజెంట్ సంస్థ సుమారు రూ.300 కోట్లతో గ్లాస్ బాటిళ్ల తయారీ యూనిట్‌ను విస్తరించనుంది. తెలంగాణలో లభించే వనరుల ఆధారంగా ఎనిమిది జిల్లాల్లో 10 పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జడ్చర్లలో 100 ఎకరాల్లో వస్త్రాల తయారీ, తోలు ఉత్పత్తుల క్లస్టర్ రానుంది.
 
 రూ.17 లక్షలకే ఇండిపెండెంట్ హౌజ్..
 షాద్‌నగర్‌లోని రామేశ్వరం దేవాలయానికి కూతవేటు దూరంలో 600 ఎకరాల్లో ఆంబియెన్స్ పేరుతో మెగా గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 147- 1,000 గజాల మధ్య విస్తీర్ణాలతో మొత్తం 10 వేల ప్లాట్లుంటాయని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నర్సింహారెడి చెప్పారు.
 
 తొలి దశలో 40 ఎకరాలకు డీటీసీపీ అనుమతులు పొందాం. ధర గజానికి రూ.2,250. ఈఎంఐ, బ్యాంకు రుణ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. 5 ఎకరాల్లో క్లబ్ హౌజ్, 5 హోల్స్ గోల్ఫ్ కోర్ట్‌లతో పాటూ ఇతర వసతులన్నీ ఉంటాయి.
 సామాన్యులకు తక్కువ ధరలో ఇండిపెండెట్ హౌజ్‌ను అందించాలనే ఉద్దేశంతో వీఎన్‌సీటీ అనే సంస్థతో కలసి హౌజింగ్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. 200 గజాల్లో 1,000 చ.అ.ల్లో నిర్మించే ఈ ఇళ్లను రూ.17 లక్షలకే అందిస్తాం. తొలి విడతగా 20 ఇళ్లను నిర్మిస్తాం. డిమాండ్‌ను బట్టి 100 ఎకరాల వరకూ విస్తరిస్తాం. ఈ ప్రాజెక్ట్‌లో 5 వేల చ.అ. క్లబ్ హౌజ్ కూడా ఉంటుంది. ఎన్నారై కొనుగోలుదారుల కోసం రుణాలిప్పించేందుకు దుబాయ్‌కు చెందిన ఎమిరైట్స్ ఎన్‌బీడీ బ్యాంక్‌తోనూ ఒప్పందం కుదుర్చుకున్నాం.
 పోలేపల్లి సెజ్‌కు దగ్గర్లో 300 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్ ఫాం ల్యాండ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో ఎకరాన్ని యూనిట్ వారీగా విక్రయిస్తాం. ధర ఎకరానికి రూ.12 లక్షలు.
 దీని ప్రత్యేకతేంటంటే.. ప్రతీ ఎకరంలో 300 మలబార్, ఐదు రకాల 25 సేంద్రియ పండ్ల మొక్కలను పెంచుతాం. మూడేళ్ల వరకు వీటి పర్యవేక్షణ, పెంపకం బాధ్యత కంపెనీదే. ఆ తర్వాత కొంత రుసుం వసూలు చేస్తాం.
 గాజులరామారంలో 25 ఎకరాల్లో వీనస్ ఎన్‌క్లేవ్‌ను ప్లాటింగ్ వెంచర్‌ను చేస్తున్నాం. ఇందులో 135- 200 గజాల మధ్య మొత్తం 460 ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.15 వేలు.
 
 నేడు, రేపు హెచ్‌డీఎఫ్‌సీ  ప్రాపర్టీ షో
 సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరో ప్రాపర్టీ షో రెడీ అయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్స్ లోన్స్ సంస్థ శని, ఆదివారాల్లో రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ‘రెడీ టు మూవ్స్ ఇన్ హోమ్స్ షో కేస్’ పేరుతో ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement