గడువు సమీపిస్తోంది.. సిద్ధ్దమేనా?

Not filed ITR for FY 2018-19? june 30 is your last chance - Sakshi

2018–19 రిటర్నులకు ఇప్పటికీ అవకాశం

జూన్‌ 30తో కొన్నింటికి తీరిపోనున్న గడువు

2019–20 పన్ను ఆదా పెట్టుబడులకు కూడా

మార్చి, ఏప్రిల్‌లో గడువు తీరిన వాటికి మరో అవకాశం

పన్ను ఆదాయం లేని వారు ఫామ్‌ 15జీ, 15హెచ్‌ ఇవ్వాలి

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను రిటర్నుల దాఖలు దగ్గర నుంచి పలు నిబంధనల అమలు విషయంలో ఎంతో ఊరట కల్పించింది. దీంతో వేతన జీవులకు, ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపశమనం లభించింది. మరి కొన్ని నిబంధనల అమలుకు ఇచ్చిన అదనపు గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. ఈ లోపు అమలు చేయాల్సిన వాటిపై ఇప్పుడే దృష్టి సారిస్తే చివరి నిమిషంలో కంగారు పడాల్సిన అవస్థ తప్పుతుంది.  

2018–19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయని వారికి కరోనా కారణంగా మరో అవకాశం లభించినట్టయింది. జూన్‌ 30 వరకు ఆలస్యపు రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. అదే విధంగా గతంలో దాఖలు చేసిన రిటర్నుల్లో మార్పులు చేయాలనుకుంటే, దానికి సంబంధించి సవరణ రిటర్నులు వేసుకోవచ్చు.  

పాన్, ఆధార్‌ లింక్‌ చేయలేదా?
పాన్‌ కార్డు కలిగిన ప్రతీ వ్యక్తి విధిగా తమ ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ఎప్పటి నుంచో కోరుతోంది. ఇందుకు సంబంధించిన గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. ఇలా పొడిగింపు ఇచ్చిన గడువు కూడా జూన్‌ 30తో ముగిసిపోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో విడత గడువు పొడిగించే అవకాశాలు లేకపోలేదు. అలా అని ఎంత కాలం పాటు దీన్ని వాయిదా వేయగలం? కనుక పాన్‌–ఆధార్‌ అనుసంధానాన్ని పూర్తి చేసుకోవడం మంచిది.

గడువులోపు ఈ పని చేయకపోతే, ఒకవేళ గడువు పొడిగింపు ఇవ్వని పక్షంలో జూలై 1 నుంచి పాన్‌ పనిచేయకుండా పోతుంది. దాంతో పాన్‌ ఇవ్వలేని పరిస్థితి. దీనివల్ల ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 272బి కింద రూ.10,000 జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు పన్ను రిటర్నులు దాఖలు చేయలేరు. అలాగే బ్యాంకు ఖాతాల ప్రారంభం, బ్యాంకుల్లో డిపాజిట్లు, డీమ్యాట్‌ ఖాతాల ప్రారంభం, స్థిరాస్తుల లావాదేవీలు, సెక్యూరిటీల లావాదేవీలు, కారు కొనుగోలు వంటివి కష్టంగా మారతాయి.  
 
ఫామ్‌ 15జీ, ఫామ్‌ 15హెచ్‌

వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు దాటని వారు ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఫామ్‌ హెచ్‌15జీ (60 ఏళ్లు దాటిన వారు ఫామ్‌ 15హెచ్‌) సమర్పించొచ్చు. తమ ఆదాయం పన్ను వర్తించని కనీస పరిమితి (రూ.2.50 లక్షలు) లోపే ఉంటుందని స్వీయ ధ్రువీకరణ ఇవ్వడమే ఈ పత్రాలను సమర్పించడం. ఇలా ఇవ్వడం వల్ల బ్యాంకులు మీకు సంబంధించి డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్‌ అమలు చేయకుండా ఉంటాయి. ఒకవేళ బ్యాంకులు టీడీఎస్‌ అమలు చేస్తే రిటర్నులు దాఖలు చేసి కానీ రిఫండ్‌ కోరేందుకు అవకాశం ఉండదు. 2019–20 సంవత్సరానికి ఫామ్‌ 15జీ, ఫామ్‌ 15హెచ్‌ సమర్పించేందుకు కేంద్రం జూన్‌ ఆఖరు వరకు గడువును పొడిగించింది. ఇక 2020–21 సంవత్సరానికి సంబంధించి ఈ పత్రాలను జూన్‌ 30 నాటికి సమర్పించాలి. దాంతో ఎటువంటి కోతల్లేకుండా చూసుకోవచ్చు.  

పన్ను ఆదాకు ఇప్పటికీ అవకాశం
గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులకు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది. వాస్తవానికి మార్చి ఆఖరుతోనే గడువు ముగిసిపోవాల్సి ఉంది. కానీ, ఈ ఏడాది కరోనా కారణంగా లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా పన్ను ఆదా కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు జూన్‌ 30 వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ), ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌), ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు.

అదే విధంగా గృహ రుణం (మొదటి ఇంటికి) తీసుకుని దానికి చెల్లింపులు చేస్తుంటే, అసలు, వడ్డీ చెల్లింపులను కూడా రిటర్నుల్లో చూపించుకోవడం ద్వారా పన్ను రాయితీలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వైద్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులతోపాటు చట్ట పరిధిలో విరాళాలపైనా 2019–20 ఆర్థిక సంవత్సరానికి పన్ను ప్రయోజనాలను పొందేందుకు ఈ నెలాఖరు నాటికి ఇచ్చిన అవకాశాన్ని కోల్పోవద్దు. ఇక కేంద్రం నోటిఫై చేసిన ఎన్‌హెచ్‌ఏఐ, పీఎఫ్‌సీ, ఐఆర్‌ఎఫ్‌సీ లేదా ఆర్‌ఈసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు చట్టపరంగా అవకాశం ఉంది.  

ఇతర పెట్టుబడులు
పీపీఎఫ్‌ ఖాతాలో కనీసం రూ.500, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కనీసం రూ.250 చొప్పున ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్‌ చేయడం తప్పనిసరి. కనుక 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క డిపాజిట్‌ కూడా చేయలేని వారికి గడువు ముగిసిపోయినా ప్రభుత్వం జూన్‌ 30 వరకు మరో అవకాశం ఇచ్చింది. దీనివల్ల రుసుములు పడవు. అదే విధంగా పోస్టాఫీసు రికరింగ్‌ డిపాజిట్‌ పథకంలోనూ ప్రతి నెలా కనీస మొత్తాన్ని తప్పకుండా డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

లేదంటే పెనాల్టీ పడుతుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జమలు చేయలేకపోయినప్పటికీ.. జూన్‌ 30 నాటికి చేయడం ద్వారా పెనాల్టీ లేకుండా చూసుకోవచ్చు. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌)లో 60 ఏళ్లు దాటిన వారు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ 55–60 ఏళ్ల మధ్య రిటైర్‌ అయిన వారు తమ రిటైర్మెంట్‌ నగదు ప్రయోజనాలను అందుకున్న నెలరోజుల్లోపు ఎస్‌సీఎస్‌ఎస్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి  నుంచి ఏప్రిల్‌ మధ్యలో ఇలా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉండి, చేయలేకపోయిన వారు జూన్‌ 30 వరకు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.  

అడ్వాన్స్‌ ట్యాక్స్‌
ఈ ఏడాది మార్చి 20 నుంచి జూన్‌ 29వ తేదీ మధ్య కాలంలో చేయాల్సిన ముందస్తు పన్ను చెల్లింపులు, టీడీఎస్‌ వంటి వాటికి గడువు జూన్‌ 30 వరకు ఉంది. తగ్గించిన పెనాల్టీ చెల్లించడం ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్లు 234బి, 234సి ప్రకారం ఆలస్యపు చెల్లింపులపై ప్రతి నెలా 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉండగా.. దీనికి బదులు 0.75 శాతం చెల్లిస్తే చాలు. 2020–21 అసెస్‌మెంట్‌ (మదింపు) సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ముందస్తు పన్ను చెల్లించేందుకు గడువు జూన్‌ 15వ తేదీ. జూన్‌ 30 తర్వాత చేసే ఆలస్యపు చెల్లింపులపై 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top