ప్రారంభాల్లో క్షీణత విక్రయాల్లో వృద్ధి

New projects launching 25% reduction in Hyderabad - Sakshi

హైదరాబాద్‌లో 25 శాతం తగ్గిన కొత్త ప్రాజెక్ట్స్‌ లాంచింగ్స్‌

రెరా, ఎన్నికల ప్రభావమే కారణం: అనరాక్‌ నివేదిక

తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ప్రభావం మొదలైంది. కొత్త గృహాల ప్రారంభాలపై వీటి ప్రభావం ప్రత్యక్షంగా పడుతోంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), రెరా.. ప్రతికూలతలతో హైదరాబాద్‌లో కొత్త గృహాల ప్రారంభాలు తగ్గిపోయాయి. పైగా ఎన్నికల వాతావరణమూ నెలకొనడంతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాల కంటే.. పాత ప్రాజెక్ట్‌ల నిర్మాణంపైనే డెవలపర్లు దృష్టిసారిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో నగరంలో 5,225 కొత్త గృహాలు ప్రారంభం కాగా.. మూడో త్రైమాసికం (క్యూ3) నాటికవి 25% క్షీణతతో 4,150కు తగ్గిపోయాయి. విక్రయాలను చూస్తే.. క్యూ2లో 4,750 గృహాలు అమ్ముడుపోగా.. క్యూ3 నాటికి 2 శాతం వృద్ధితో 4,850కు పెరిగాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు.

ప్రారంభాల్లో 3 శాతం, అమ్మకాల్లో 9 శాతం వృద్ధి
దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, హైదరాబాద్‌లో క్యూ3లో 52,150 కొత్త గృహాలు ప్రారంభమయ్యాయి. క్యూ2లో ఇవి 50,600గా ఉన్నాయి. విక్రయాలు క్యూ2లో 61,550 యూనిట్లు కాగా.. క్యూ3 నాటికి 67,175కు పెరిగాయి. అంటే దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో త్రైమాసికం వ్యవధిలోనే కొత్త గృహాల ప్రారంభాల్లో 3 శాతం, అమ్మకాల్లో 9 శాతం వృద్ధి నమోదైదన్నమాట.

కొత్త గృహాల్లోనూ 76 శాతం ప్రారంభాలు ముంబై, పుణే, బెంగళూరు, చెన్నైల్లోనే జరిగాయి. రూ.40 లక్షల లోపు ఉన్న గృహాలు 42 శాతం ఉంటే, రూ.40–80 లక్షల లోపు ఉన్న గృహాలు 33 శాతం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలు 25 శాతం వరకున్నాయి.

నగరాల వారీగా ప్రారంభాలు చూస్తే..
ఈ ఏడాది క్యూ2లో ఎన్‌సీఆర్‌లో 8,475 యూనిట్లు ప్రారంభమైతే.. క్యూ3 నాటికి 50 శాతం క్షీణతతో 4,200కు తగ్గాయి. ముంబైలో క్యూ2లో 14 వేల గృహాలొస్తే.. క్యూ3 నాటికి 42 శాతం వృద్ధితో 19,850 కు పెరిగాయి. బెంగళూరులో క్యూ2లో 8,775 నుంచి క్యూ3లో 18 శాతం క్షీణతతో 7,175కు తగ్గాయి. పుణేలో క్యూ2లో 7,075 నుంచి క్యూ3లో 11 శాతం వృద్ధితో 7,875 యూనిట్లకు, చెన్నైలో క్యూ2లో 4,200 నుంచి క్యూ3లో 15 శాతం వృద్ధితో 4,850కు, కోల్‌కతాలో క్యూ2లో 2,550 నుంచి క్యూ3లో 59 శాతం వృద్ధితో 4,050 గృహాలకు పెరిగాయి.

అమ్మకాల్లో వృద్ధి..
ఎన్‌సీఆర్‌లో క్యూ2లో 11,150 గృహాలు అమ్ముడుపోగా.. క్యూ3 నాటికి 2 శాతం వృద్ధితో 11,350 కు పెరిగాయి. ముంబైలో 15,750 నుంచి 18,200 కు, బెంగళూరులో 14,800 నుంచి 16,250 కు, పుణేలో 8,375 నుంచి 9,300 కు, చెన్నైలో 2,700 నుంచి 2,925లకు, కోల్‌కతాలో 4,025 నుంచి 4,300లకు పెరిగాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top