
న్యూఢిల్లీ: కేంద్రం–రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మధ్య ఇటీవలి ఘర్షణాత్మక వైఖరి తాజాది కాదనీ... మొదటి నుంచీ ఆర్‌బీఐపై కేంద్రం పెత్తనం కొనసాగిందని పేరుతెలపడానికి ఇష్టపడని ఒక ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచీ ఇలాంటి ధోరణి ఉందని ఆయన విశ్లేషించారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కేంద్రం కాలరాస్తోందంటూ తాజాగా నిరసనలను ఎదుర్కొం టున్న మోడీ ప్రభుత్వానికి తాజా విశ్లేషణలకు కొంత ఊరటకలిగించేవే.
ఉన్నత స్థాయి అధికారి కథనం ప్రకారం– కేంద్రం బ్యాంకులు స్వయం ప్రతిపత్తి ఉండాలని నాటి ప్రధానమంత్రి నెహ్రూ పేర్కొన్నా రు. అయితే అది కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రతిపాదనకు సంబంధించి తన ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారివైపు తొలి ప్రధాని నిలబడ్డంతో, అప్పటి ఆర్‌బీఐ నాల్గవ గవర్నర్ బెనగల్ రామ రావ్ 1957లో తన పదవికి రాజీనామా చేశారు. అటు తర్వాత కాలాల్లో గవర్నర్లుగా వచ్చిన ఎన్‌సీ సేన్‌గుప్తా, కేఆర్ పురి, దువ్వూరి సుబ్బారావుల వంటివారూ ప్రభుత్వ విధానాలతో పొసగని పరిస్థితులను ఎదుర్కొన్నారని ఉన్నతాధికారి పేర్కొన్నారు.