ప్రపంచ కుబేరుల్లో ముకేశ్‌ అంబానీకి 13వ స్థానం | Sakshi
Sakshi News home page

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్‌ అంబానీకి 13వ స్థానం

Published Wed, Mar 6 2019 5:00 AM

Mukesh Ambani is 13th richest in world - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. గతేడాదిలో 40.1 బిలియన్‌ డాలర్ల సంపదతో 19వ స్థానంలో ఉన్న ఈయన.. ఈ ఏడాదిలో 50 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రస్తుత ర్యాంక్‌కు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 106 మంది భారతీయులకు చోటు దక్కింది. వీరిలో ముకేశ్‌ అంబానీ తరువాత.. విప్రో అజిమ్‌ ప్రేమ్‌జీ 36వ స్థానంలో నిలిచారు.

ఈయన సంపద 22.6 బిలియన్‌ డాలర్లు. హెచ్‌సీఎల్‌ కో–ఫౌండర్‌ శివ్‌ నాడార్‌ 82వ స్థానంలో నిలవగా.. ఆర్సెలర్‌ లక్ష్మీ మిట్టల్‌ 91వ స్థానాన్ని దక్కించుకున్నారు. వరుసగా ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ బిర్లా (122), అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ (167), భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ (244), పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకులు ఆచార్య బాల్‌కృష్ణ (365), పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌ (436), బయోకాన్‌ ఫౌండర్‌ కిరణ్‌ మజుందార్‌ షా (617), ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌. నారాయణ మూర్తి (962), ఆర్‌కామ్‌ చైర్మన్‌ రిలయన్స్‌ అనిల్‌ అంబానీ (1349) స్థానాల్లో నిలిచారు.  

Advertisement
Advertisement