ఎగుమతులకు మరిన్ని ప్రోత్సాహకాలు

More incentives for exports - Sakshi

విదేశీ వాణిజ్య విధాన మధ్యంతర సమీక్ష

వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు పెంపు

రూ.8,450 కోట్ల కేటాయింపులు

ఉపాధి కల్పించే రంగాలకు వెన్నుదన్ను  

న్యూఢిల్లీ: ఎగుమతులు బలోపేతమే లక్ష్యంగా మరిన్ని ప్రోత్సాహకాలతో కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానానికి (ఎఫ్‌టీపీ) తాజా మెరుగులద్దింది. 2015–20 వాణిజ్య విధానాన్ని మధ్యంతరంగా సమీక్షించి పలు ప్రోత్సాహకాలతో మళ్లీ ఆవిష్కరించింది. సరుకుల ఎగుమతుల పథకం (ఎంఈఐఎస్‌) ప్రోత్సాహకాన్ని 2 శాతం మేర పెంచినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు ఎఫ్‌టీపీ విడుదల సందర్భంగా తెలిపారు. వార్షిక ప్రోత్సాహక బడ్జెట్‌ 34 శాతం పెంపుతో రూ.8,450 కోట్లకు చేరిందన్నారు. ‘‘దీంతో తోలు, చేతి ఉత్పత్తులు, కార్పెట్లు, క్రీడా వస్తువులు, వ్యవసాయం, మెరైన్, ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్లకు ప్రయోజనం కలుగుతుంది. వాణిజ్య విధానాన్ని మరింతగా సులభతరం చేసి ఎగుమతులను పెంచాలన్న లక్ష్యంతోనే దీన్ని మధ్యంతరంగా సమీక్షించాం. అధిక ఉపాధినిచ్చే రంగాలకు మద్దతు పెంచటం, సేవల ఎగుమతులను ప్రోత్సహించడం కూడా మా లక్ష్యాల్లో ఉన్నాయి’’ అని మంత్రి వివరించారు. కొత్త మార్కెట్లను, ఉత్పత్తులను గుర్తించడంతోపాటు సంప్రదాయ మార్కెట్లలో, ఉత్పత్తుల్లో భారత వాటాను పెంచడంపై ఎఫ్‌టీపీ దృష్టి సారిస్తుందన్నారు. అంతర్జాతీయంగా భారత పరిశ్రమ ప్రాతినిధ్యాన్ని పెంచుతామన్నారు. ‘‘ఎఫ్‌టీపీ కింద ఏటా అదనంగా తోలు రంగానికి రూ.749 కోట్లు, చేతి తయారీ సిల్క్‌ కార్పెట్లు, హ్యాండ్లూమ్, జూట్, కాయిర్‌ ఉత్పత్తులకు రూ.921 కోట్లు, వ్యవసాయోత్పత్తులకు రూ.1,354 కోట్లు, మెరైన్‌ ఉత్పత్తులకు రూ.759 కోట్లు, టెలికం, ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్ల ఎగుమతులకు రూ.369 కోట్లు,  మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌కు రూ.193 కోట్ల ప్రయోజనాలు లభిస్తాయి’’ అని సురేష్‌ ప్రభు తెలిపారు. జీఎస్టీ ఎగుమతుల వృద్ధికి ప్రేరణగా ఉంటుందన్నారు. ఐదేళ్ల ఎఫ్‌టీపీ కింద 2020 నాటికి కేంద్రం 900 బిలియన్‌ డాలర్ల వస్తు, సేవల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఎగుమతుల్లో దేశీయ వాటా 2 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలన్నది కేంద్రం ఆశయం.

ఎఫ్‌టీపీ ప్రధానాంశాలివీ...
►ఎంఈఐఎస్‌ ప్రోత్సాహకాలను రెడీమేడ్‌ గార్మెంట్స్‌పై 2 శాతం పెంచడం వల్ల వార్షికంగా ప్రభుత్వంపై రూ.2,743 కోట్ల భారం పడుతుంది.
► ఎంఈఐఎస్‌ వార్షిక బడ్జెట్‌ పెంపు 34 శాతం. దీంతో మొత్తం బడ్జెట్‌ రూ.8,450 కోట్లకు చేరింది.
►సేవల ఎగుమతుల పథకం (ఎస్‌ఈఐఎస్‌) కింద కూడా ప్రోత్సాహకాలను కేంద్రం 2 శాతం మేర పెంచి రూ.1,140 కోట్లు చేసింది.
►సెజ్‌లకు సరఫరా చేసే వస్తు, సేవలను జీఎస్టీ కింద సున్నా రేటుగా పరిగణిస్తారు.
►డ్యూటీ క్రెడిట్‌ స్క్రిప్స్‌ చెల్లుబాటు కాలాన్ని 18 నెలల నుంచి 24 నెలలకు పెంచింది.
►లాజిస్టిక్స్‌ను ప్రోత్సహించేందుకు గాను నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు.
►పారదర్శకత దిశలో డేటా ఆధారిత విధాన చర్యలకు గాను డీజీఎఫ్‌టీ పేరుతో అనలైటిక్స్‌ డివిజన్‌ ఏర్పాటవుతుంది.
►నియంత్రణ సంస్థల నిబంధనలను పాటించేందుకు, నూతన మార్కెట్లను చేరుకునేందుకు ఎగుమతిదారులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు నిపుణులతో బృందం ఏర్పాటు అవుతుంది.
►విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు నూతన విధానం.
►సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ఎగుమతులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ఉపాధి కల్పనపై దృష్టి సారిస్తారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top