మిల్క్‌‘షేక్‌’ చేస్తున్నారు..  | Milkshake show is coming to Darlington | Sakshi
Sakshi News home page

మిల్క్‌‘షేక్‌’ చేస్తున్నారు.. 

Jul 19 2018 1:11 AM | Updated on Jul 19 2018 10:25 AM

Milkshake  show is coming to Darlington - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లండన్‌లో మిల్క్‌షేక్‌ రుచిచూశాడు. అలాంటిదే భారత్‌లోనూ తయారు చేసి విక్రయించాలనుకున్నాడు. ఏడాదిపాటు అధ్యయనం చేసి చివరకు ‘మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌’ పేరిట రంగంలోకి దిగాడు. తొలి స్టోర్‌ హిట్‌!!. మిల్క్‌షేక్స్‌ రుచికి ఫిదా అయిన ఇంజనీరింగ్‌ విద్యార్థుల బృందం ఫ్రాంచైజీకి ముందుకొచ్చింది. అలా మొదలైన కంపెనీ ప్రస్థానం నాలుగేళ్లలో 75 ఔట్‌లెట్ల స్థాయికి చేరింది. ఇప్పుడు యూఎస్‌లోనూ అడుగుపెడుతున్నట్లు ‘మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌’ ఫౌండర్‌ రాహుల్‌ తిరుమలప్రగడ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. కంపెనీ భవిష్యత్‌ ప్రణాళిక ఆయన మాటల్లోనే... 

హైవేలో దూసుకెళ్లాం.. 
యూకేలోని సండెర్లాండ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. అక్కడ చదువుకునే రోజుల్లో ఓ స్టోర్‌లో దొరికే మిల్క్‌షేక్స్‌ బాగా ఆకట్టుకున్నాయి. అదే వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకున్నా. ఏడాది పాటు అధ్యయనం చేసి 2013లో హైదరాబాద్‌–బెంగళూరు హైవేలో మేకర్స్‌ ఆఫ్‌ మిల్స్‌షేక్స్‌ స్టోర్‌ను ప్రారంభించా. కస్టమర్లు ఫిదా అయ్యారు. ఔట్‌లెట్‌ మొదలైన కొద్దిరోజుల్లోనే ఓ స్నేహితుల బృందం ఫ్రాంచైజీకి ముందుకొచ్చింది. అలా ఇప్పుడు 75 ఔట్‌లెట్లు నడుస్తున్నాయి. వీటిలో 73 ఫ్రాంచైజీలవే.  

మిల్క్‌షేక్స్‌ 105 ఫ్లేవర్లలో.. 
ఓ ఫుడ్‌ కంపెనీ సాయంతో ఆరు నెలలపాటు శ్రమించి బేస్‌ మిల్క్‌ షేక్‌ మిక్స్‌ను అభివృద్ధి చేశాం. మిల్క్‌షేక్స్‌ తయారీకి ఈ మిక్స్‌ ప్రధాన ముడిపదార్థం. కొవ్వు, చక్కెర శాతం తక్కువ. యూకే, యూఎస్‌ స్టాండర్డ్స్‌ పాటిస్తున్నాం. ముడి సరుకు ఏమాత్రం వృధా కాదు. మొత్తం 105 రకాల రుచులను విక్రయిస్తున్నాం. ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలను ప్రవేశపెడుతున్నాం. మిల్క్‌షేక్స్‌ ధర రూ.140తో మొదలై రూ.250 వరకు ఉంది. 

విదేశాల్లో ‘షేక్‌’.. 
యూఎస్‌లో స్టోర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. దుబాయి తదితర దేశాల నుంచీ ఎంక్వైరీలు వస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లోనూ అడుగుపెట్టబోతున్నాం. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అన్నవరంలో మా కేంద్రాలున్నాయి. 2018లో మొత్తం 100 కేంద్రాలు, 2019 డిసెంబరు నాటికి 200 స్టోర్ల స్థాయికి చేరుకుంటాం. భారత్‌లో అన్ని ప్రధాన పట్టణాల్లోకీ ప్రవేశిస్తాం. ప్రతి కేంద్రం ద్వారా 3–5 మందికి ఉపాధి లభిస్తుంది. కంపెనీలో 250 మంది ఉద్యోగులున్నారు. 

2018–19లో రూ.40 కోట్లు.. 
సీడ్‌ ఫండ్‌ కింద రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టాం. నిధుల సమీకరణ ఆలోచన లేదు. సంస్థలో మరో ఇద్దరు భాగస్వాములు అభిలాష్,  శ్రీనివాస్‌లకు చెరి 10 శాతం వాటా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల వ్యాపారం చేశాం. 2018–19లో రూ.40 కోట్లు ఆశిస్తున్నాం. ఒక్కో స్టోర్‌కు ఫ్రాంచైజీకి రూ.18 లక్షలవుతుంది. ఏడాదిలో పెట్టుబడి మీద లాభాలు ఆర్జించొచ్చు. 300–1,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. సిబ్బందికి శిక్షణ మేమే ఇచ్చి నియమిస్తాం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement