తనఖాల్లేకుండా వేల కోట్ల రుణాలా?

Madras HC slams SBI for granting loans to corporates without security - Sakshi

విద్య, వ్యవసాయ రుణాలకు మాత్రం ప్రజలు అడుక్కునే పరిస్థితి

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రశ్నించిన మద్రాస్‌ హైకోర్టు

కనిష్క్‌ గోల్డ్‌ స్కామ్‌ వ్యవహారంలో తీవ్ర ఆగ్రహం  

చెన్నై: కార్పొరేట్‌ కంపెనీల రుణ ఎగవేతల విషయంలో బ్యాంకుల ఉదాసీనతపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన తనఖాల్లేకుండా కంపెనీలకు వేల కోట్ల రుణాలను ఎలా మంజూరు చేశారంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను నిగ్గదీసింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు చెన్నైకు చెందిన కనిష్క్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాదాపు రూ.820 కోట్ల రుణాలను ఎగవేసిన సంగతి తెలిసిందే. ఈ రుణ ఎగవేత స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీచేసిన కనిష్క్‌ గోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ ఆదేశాలను కొట్టివేయాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చట్టపరమైన రుణ రికవరీ చర్యల్లో భాగంగా ఎస్‌బీఐ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.

అధికారులెవరూ తప్పించుకోలేరు...
కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌ బ్యాంకు తరఫు న్యాయవాదులను తూర్పారబట్టారు. ‘ఇదంతా ప్రజల సొమ్ము. ఒకపక్క ప్రజలేమో విద్య, వ్యవసాయ రుణాల కోసం తనఖాలు పెట్టికూడా బ్యాంకులను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క బ్యాంకులు మాత్రం సరైన తనఖాల్లేకుండానే ఇష్టానుసారంగా కంపెనీలకు వేల కోట్ల రుణాలిచ్చేస్తున్నాయి. సర్ఫేసి చట్టం ప్రకారం అధికారులెవరూ తప్పించుకోలేరు. వారికి కొమ్ము కాయొద్దు. ఈ స్కామ్‌తో ప్రమేయం ఉన్న బ్యాంక్‌ ఆఫీసర్లందరినీ అరెస్ట్‌ చేసేవిధంగా ఆదేశిస్తాం.

ఈ కేసులో మేమిచ్చే తీర్పు దేశవ్యాప్తంగా ఒక గీటురాయిగా మారుతుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘అసలు ఈ సంస్థకు రుణాలిచ్చేముందు బ్యాంక్‌ అధికారులు డాక్యుమెంట్లన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించారా? మంజూరు చేసిన మొత్తం రుణం ఎంత? దీనికి ప్రతిగా కంపెనీ తనఖాగా పెట్టిన ఆస్తుల విలువ ఎంత? అంటూ జడ్జి ప్రశ్నలు సంధించారు. కాగా, ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్న అధికారుల వివరాలను సేకరించాలని, తగిన దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలంటూ ఈడీ న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.

ఇది ఎన్‌పీఏ కేసు మాత్రమే కాదు...
కనిష్క్‌ గోల్డ్‌ తప్పుడు పత్రాలను సమర్పించి రుణాలను పొందిందని, అదేవిధంగా ఈ నిధులను పక్కదారి పట్టించారని కూడా ఈడీ తన కౌంటర్‌లో పేర్కొంది. మొత్తంమీద ఈ మోసంలో బ్యాంకులకు రూ.824 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. అయితే, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బ్యాంకుల వద్ద తనఖాలో ఉన్న స్థిరాస్తుల విలువ రూ.158.65 కోట్లేనని కూడా ఈడీ వివరించింది. రుణం మంజూరు సమయంలో బ్యాంకు అధికారులు తగిన పరిశీలన జరపలేదని స్పష్టం చేసింది.

‘ఇది మొండిబకాయి(ఎన్‌పీఏ) కేసు మాత్రమే కాదు. రుణ గ్రహీత(కనిష్క్‌ గోల్డ్‌)తో పాటు బ్యాంకుల కన్సార్షియంకు చెందిన అధికారుల ప్రమేయంతో నేరపూరిత కుట్ర, మోసం కూడా ఇందులో ఉంది’ అని ఈడీ వాదించింది. ఈ స్కామ్‌కు సంబంధించి కనిష్క్‌ గోల్డ్‌ డైరెక్టర్లలో ఒకరైన భూపేష్‌ కుమార్‌జైన్‌ను పన్ను ఎగవేత ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. ఈడీ డైరెక్టర్‌ కూడా మనీలాండరింగ్‌ చట్టం కింద కనిష్క్‌ గోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు  ఆదేశించారు. ప్రజల సొమ్ము రికవరీ ప్రయత్నాలకు ఈడీ ఆదేశాలు గండికొడతాయని, దీన్ని కొట్టేయాలంటూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top