ఈసారి చిన్న సంస్థల వంతు..! | Sakshi
Sakshi News home page

ఈసారి చిన్న సంస్థల వంతు..!

Published Wed, Mar 21 2018 12:17 AM

Kotak announces digital first growth strategy - Sakshi

ముంబై: మొండిబాకీల సమస్య కేవలం పెద్ద కార్పొరేట్లకే పరిమితం కాదని... ఈసారి చిన్న సంస్థల వంతూ రానుందని ప్రముఖ బ్యాంకరు, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కొటక్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) ఇచ్చిన రుణాల నాణ్యతపై మరింతగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ‘మొండిబాకీలన్నీ పెద్దపెద్ద కార్పొరేట్లవేనన్న అభిప్రాయం ఉంది. అయితే, ఎస్‌ఎంఈ వ్యాపారాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అదింకా పూర్తి స్థాయిలో బయటపడటం లేదు అంతే..‘ అని ఉదయ్‌ పేర్కొన్నారు.

ఐటీ దిగ్గజం నందన్‌ నీలేకని సమక్షంలో మంగళవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన కొటక్‌ మహీంద్రా బ్యాంకు ‘విజన్‌’ను ఆవిష్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) వర్గీకరణ విషయంలో ఫిబ్రవరి 12న ఆర్‌బీఐ ఇచ్చిన సర్క్యులర్‌తో మొండిబాకీల సమస్య మరింతగా ముదిరే అవకాశం ఉందన్నారు. ‘‘ఎన్‌పీఏల విషయంలో యూరోపియన్‌ దేశాలైన గ్రీస్, ఇటలీ తర్వాత మూడో స్థానానికి భారత్‌ చేరింది. దీన్ని చక్కదిద్దే చర్యలు అవసరం’’ అని ఉదయ్‌ కొటక్‌ వ్యాఖ్యానించారు.

టెక్నాలజీతో కొటక్‌ ఛార్టర్‌...
తక్కువ నగదున్న వ్యవస్థలో వినియోగదారులకు టెక్నాలజీ ఆధారంగా మరింత మెరుగైన సేవలందించటమే లక్ష్యంగా కొటక్‌మహీంద్రా బ్యాంకు తాలూకు ఏబీసీడీ ఛార్టర్‌ను నీలేకనితో కలసి ఉదయ్‌ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఇవి...ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ముడిపడ్డ యాప్,  బయో మెట్రిక్‌ బ్రాంచ్‌లు, కస్టమర్‌కు తగ్గ సేవలు, డేటాతో నిండిన డిజైన్‌. ఈ సందర్భంగా నీలేకని మాట్లాడుతూ ‘‘గడిచిన దశాబ్దంలో టెక్నాలజీతో అంతరాలు తగ్గాయి. ప్రపంచమంతా ఒక్క మొబైల్‌లో ఒదిగిపోవటంతో మనం ముందెన్నడూ ఊహించని సేవలు, ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి’’ అన్నారు.

అందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఏడాది కిందట 811 సేవింగ్స్‌ ఖాతాను ప్రారంభించామని, ఇపుడు పూర్తి స్థాయి ఉత్పత్తులు, సేవలను దేశం నలుమూలలకూ అందించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నామని ఉదయ్‌ కొటక్‌ తెలియజేశారు. ‘‘ఆధార్‌ ఓటీపీ గుర్తింపును ఆర్‌బీఐ ఆమోదించిన మూడునెలలకు మేం 811 సేవల్ని ఆరంభించాం. అప్పటికి 80 లక్షల మంది ఖాతాదారులున్నారు. డిసెంబర్‌ 31నాటికి ఈ సంఖ్య 1.2 కోట్లకు చేరింది. దేశంలోని డిపాజిట్లలో 2 శాతం... మొబైల్‌ లావాదేవీల్లో 8 శాతం మా సొంతం. వచ్చే ఐదేళ్లలో ప్రయివేటు బ్యాంకుల వాటా 30 నుంచి 50 శాతానికి చేరుకుంటుందనే నమ్మకం నాకుంది’’ అన్నారాయన.

మొండి బాకీలకూ టెక్నాలజీ పరిష్కారం
2008 ఆర్థిక సంక్షోభం తరవాత సరైన మదింపు లేకుండా ఇన్‌ఫ్రా తదితర రంగాలకు భారీ రుణాలిచ్చారని, వాటి చెల్లింపులను ఎనిమిదేళ్లుగా పొడిగించుకుంటూ రావడం మొండిబాకీల సంక్షోభానికి ప్రధాన కారణమని ఉదయ్‌ వ్యాఖ్యానించారు. సంక్షోభానంతరం ఇచ్చిన రుణాల అసలు మొత్తంలో కనీసం 40 శాతం వెనక్కి వచ్చినా సంతోషించవచ్చన్నారు. ప్రస్తుతం రిటైల్‌ రుణాల మంజూరులో టెక్నాలజీని వినియోగిస్తుండటం.. భవిష్యత్‌లో మొండిబాకీల సమస్యలను తగ్గించేందుకు తోడ్పడగలదని చెప్పారు.

బ్యాంకుల జాతీయీకరణతో ఒరిగిందేమిటి ..
బ్యాంకుల జాతీయీకరణ జరిగి 50 ఏళ్లు గడిచినా... అనేక కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని ఉదయ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల జాతీయీకరణతో ఒనగూరిన ప్రయోజనాలేమిటని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వజ్రాభరణాల వ్యాపారస్తులు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలు .. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును (పీఎన్‌బీ) భారీగా మోసగించిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటివి అసాధారణ పరిస్థితులన్నారు.

ఈ స్కాంతో బ్యాంకింగ్‌ వ్యవస్థపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడానికి బ్యాంకర్లతో పాటు నియంత్రణ సంస్థ, ప్రభుత్వం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) చెల్లింపుల వ్యవస్థ ద్వారా లావాదేవీలు వంద కోట్ల స్థాయికి చేరగలవని నీలేకని చెప్పారు. గతేడాది డిసెంబర్‌ ఆఖరు నాటికి ఈ లావాదేవీలు 14.5 కోట్లకు చేరాయి.

Advertisement
Advertisement