రామ్‌కీ ఎన్విరోలో కేకేఆర్‌కు 60% వాటా

KKR acquires 60% stake in Ramky Enviro Engineers for $530 mln - Sakshi

రూ.3,808 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌: రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈఈఎల్‌)లో 60 శాతం వాటాను 560 మిలియన్‌ డాలర్లు (రూ.3,808 కోట్లు) వెచ్చించి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ‘కేకేఆర్‌’ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఆదివారం ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ కంపెనీ విలువ 925 మిలియన్‌ డాలర్లు (రూ.6,290 కోట్లు) అవుతుంది. మున్సిపల్, బయోమెడికల్‌ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సేకరణ, ప్రాసెస్, రవాణా సేవల్లో ఆర్‌ఈఈఎల్‌ సేవలు అందిస్తోంది.

అలాగే, పేపర్, ప్లాస్టిక్, కెమికల్స్‌ రీసైకిల్‌ వ్యాపారంలోనూ ఉంది. చెత్త నుంచి ఇంధన విద్యుత్‌ (పునరుత్పాదక ఇంధన వ్యాపారం) తయారీపైనా కంపెనీ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 60 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే, దక్షిణాసియాలోని పలు దేశాలు, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలోనూ కార్యకలాపాలను కలిగి ఉంది. కేకేఆర్‌ తన ‘ఆసియా ఫండ్‌–3’ ద్వారా ఆర్‌ఈఈఎల్‌లో ఇన్వెస్ట్‌ చేయనుంది.

ఇది ఒకానొక అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడి అవుతుంది. పర్యావరణ పరంగా ఎదుర్కొంటున్న అంశాల పరిష్కారానికి తమ కార్యక్రమాన్ని కేకేఆర్‌ సహకారంతో మరింత ముందుకు తీసుకెళతామని ఆర్‌ఈఈఎల్‌ ఎండీ, సీఈవో ఎం.గౌతంరెడ్డి తెలిపారు. ఆర్‌ఈఈఎల్‌ కార్యకలాపాలు స్వచ్ఛ్‌భారత్‌కు మద్దతునిచ్చేవిగా కేకేఆర్‌ ఇండియా సీఈవో సంజయ్‌నాయర్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top