జస్ట్‌ డయల్‌పై గూగుల్‌ కన్ను! | Just Dial rallies 20% on takeover talks by Google | Sakshi
Sakshi News home page

జస్ట్‌ డయల్‌పై గూగుల్‌ కన్ను!

Nov 11 2017 1:12 AM | Updated on Nov 11 2017 1:12 AM

Just Dial rallies 20% on takeover talks by Google - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ సెర్చింజన్‌ సంస్థ జస్ట్‌ డయల్‌పై ప్రపంచ ఇంటర్నెట్‌ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ కన్ను పడిందా...? జస్ట్‌ డయల్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్‌ ఉత్సాహం చూపిస్తోందా...? శుక్రవారం మార్కెట్లో ఈ సమాచారమే హల్‌చల్‌ చేసింది. ఈ దిశగా గూగుల్‌ చర్చలు కూడా మొదలు పెట్టిందని, త్వరలోనే జస్ట్‌ డయల్‌ను కొనుగోలు చేయవచ్చంటూ ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనం ఇన్వెస్టర్లలో ఆసక్తికి దారి తీసింది.

సంబంధిత కథనం ప్రకారం... దేశీయంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై గూగుల్‌ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పలు వ్యాపారాల్లో తనకు పోటీగా ఉన్న జస్ట్‌డయల్‌ను కొనేద్దామన్న ఆలోచనతో ఉంది. జస్ట్‌ డయల్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటికే 2 కోట్ల సంస్థలు లిస్ట్‌ అయి ఉన్నాయి. దీంతో జస్ట్‌ డయల్‌ను సొంతం చేసుకుంటే వృద్ధికి కలిసొస్తుందన్నది గూగుల్‌ వ్యూహం.

జస్ట్‌ డయల్‌ విస్తరణ...
మరోవైపు జస్ట్‌డయల్‌  కూడా తన వ్యాపార విస్తరణలో వేగాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సంస్థకు 70 శాతం ట్రాఫిక్‌ గూగుల్‌ ద్వారానే వస్తుండడం కీలకమైన అంశం. గూగుల్, ఆస్క్‌మి నుంచి పోటీని తట్టుకునేందుకు వీలుగా సెర్చ్‌ప్లస్‌ తరహా సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. స్థానిక సమాచారం అందించే సంస్థగా ఉన్న జస్ట్‌ డయల్‌ నూతన వ్యాపార అవకాశాలపైనా కన్నేసింది.

ఇందులో భాగంగా ఇటీవలే జేడీ ఓమ్నిని ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి సంస్థలు ఆన్‌లైన్‌ వేదికగా తమ వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు పూర్తి సహకారాన్ని జేడీ ఓమ్ని అందిస్తుంది. అయినప్పటికీ సెర్చింజన్లలో సేవల్లో గూగుల్‌ నుంచి పోటీ పెరగడంతో జస్ట్‌ డయల్‌ వ్యాపారం అంత సులభం కాబోదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ గూగుల్‌ కనుక జస్ట్‌ డయల్‌ను కొనుగోలు చేస్తే, అప్పుడు జస్ట్‌ డయల్‌ చాలా వేగంగా వృద్ధి చెందుతుందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
లాభపడిన షేరు
గూగుల్‌ కొనుగోలు వార్తలు జస్ట్‌ డయల్‌ షేరును మార్కెట్లో పరుగులు పెట్టించాయి. ఇంట్రాడేలో 20 శాతం  పెరిగి రూ.549.85 వరకు వెళ్లిన షేరు, ఆ తర్వాత కొనుగోలు వార్తలను కంపెనీ ఖండించడంతో 9 శాతం లాభంతో బీఎస్‌ఈలో రూ.500.30 వద్ద క్లోజయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement