గ్లోబల్‌ ఫీచర్‌ఫోన్‌ మార్కెట్లో అదే టాప్‌!

Jio Phone Tops Global Feature Phone Market in Q1 - Sakshi

రిలయన్స్‌ జియో సంచలనాలు సృష్టిస్తూ తీసుకొచ్చిన జియోఫోన్‌ ఇటు భారత్‌లోనే కాక, అటు ప్రపంచవ్యాప్తంగా తన పేరును మారుమ్రోగించుకుంటోంది. 2018 తొలి త్రైమాసికంలో గ్లోబల్‌ ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ జియోఫోనే అగ్రస్థానంలో నిలిచింది. 15 శాతం షేరుతో రిలయన్స్‌ జియోఫోన్‌ ఈ స్థానాన్ని దక్కించుకుంది. జియోఫోన్‌ అనంతరం నోకియా హెచ్‌ఎండీ, ఇంటెల్‌, శాంసంగ్‌, టెక్నో కంపెనీలు నిలిచినట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. రిలయన్స్‌ జియోఫోన్‌ బలమైన షిప్‌మెంట్లతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్‌ ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో వార్షికంగా 38 శాతం వృద్ధి సాధించినట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. గ్లోబల్‌ ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో నోకియా హెచ్‌ఎండీ 14 శాతం మార్కెట్‌ షేరును సంపాదించుకోగా, ఇంటెల్‌ 13 శాతం, శాంసంగ్‌ 6 శాతం, టెక్నో 6 శాతం  మార్కెట్‌ షేరును పొందినట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ పేర్కొంది. 

ప్రతేడాది 50 కోట్ల ఫీచర్‌ ఫోన్లు విక్రయమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల ఫీచర్‌ ఫోన్లు అవసరం ఉందని ఈ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. ఓ వైపు మొబైల్‌ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లు రాజ్యమేలుతున్నప్పటికీ, ఫీచర్‌ ఫోన్లు మాత్రం తన సత్తా చాటుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది స్మార్ట్‌ఫోన్ల కంటే ఫీచర్‌ ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారు. 2018 తొలి త్రైమాసికంలో భారత్‌ ఒక్క దేశమే మొత్తం ఫీచర్‌ ఫోన్‌ షిప్‌మెంట్లలో సుమారు 43 శాతం స్థానాన్ని సంపాదించుకుంది. కొంతమంది ఫీచర్‌ ఫోన్‌ కొనుగోలుదారులు డిజిటల్‌, ఎకనామిక్‌, అక్షరాస్యత వంటి విషయాల్లో వెనుకబడి ఉండటం, ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను, వాటి డేటా ప్లాన్లను అందిపుచ్చుకునే స్థాయి లేకపోవడమే ఫీచర్‌ ఫోన్‌ వృద్ధికి సహకరిస్తుందని రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. మొబైల్‌ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫీచర్‌ ఫోన్‌ సెగ్మెంట్‌కు భారీ అవకాశాలున్నట్టు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top