ద్రవ్యోల్బణం, క్యూ3 ఫలితాలతో దిశా నిర్దేశం..

Inflation data, Q3 earnings will drive market this week - Sakshi

సోమవారం వెల్లడికానున్న డబ్ల్యూపీఐ, సీపీఐ

శుక్రవారం విదేశీ మారక నిల్వల సమాచారం వెల్లడి

ఈ వారంలోనే ఆర్‌ఐఎల్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు

ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో ఈ ఏడాది క్యూ3 (అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల గణాంకాలు .. సూచీలకు నూతన ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అంతక్రితం రెండు వారాలు నష్టాల్లో ముగిసిన ప్రధాన సూచీలు.. ఫలితాల నేపథ్యంలో గతవారం పాజిటివ్‌ ముగింపును నమోదుచేశాయి. ఇక ఈ వారంలో.. ఫలితాలు ప్రకటించే దిగ్గజాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్‌ యునిలివర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటు ద్రవ్యోల్బణ సమాచారం, అంతర్జాతీయ అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  

80 కంపెనీల ఫలితాలు..
బీఎస్‌ఈలో లిస్టైన 80 కంపెనీలు ఈవారంలో (జనవరి 14–19) క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి. సోమవారం ఇండియా బుల్స్‌ వెంచర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఫలితాలను వెల్లడించనుండగా.. మంగళవారం జీ ఎంటర్‌టైన్‌మెంట్, డెన్‌ నెట్‌వర్క్స్, కేపీఐటీ టెక్నాలజీస్, ట్రైడెంట్‌.. బుధవారం డీసీబీ బ్యాంక్, హెచ్‌టీ మీడియా, మైండ్‌ట్రీ ఫలితాలు వెల్లడికానున్నాయి. గురువారం ఆర్‌ఐఎల్, హెచ్‌యూఎల్, ఫెడరల్‌ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్, ర్యాలీస్‌ ఇండియా, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఫలితాలు ఉండగా.. శుక్రవారం విప్రో, ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్‌బీఐ లైఫ్, అతుల్, ఎల్‌ అండ్‌ టి ఇన్ఫోటెక్, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ ఫలితాలను ప్రకటించనున్నాయి. శనివారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలను ప్రకటించనుంది. ఈ వారంలో వెల్లడికానున్న ఫలితాలు, ద్రవ్యోల్బణ డేటా వెల్లడి మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్ణయించనున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు.  

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి ..
డిసెంబర్‌ నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. వాణిజ్య శేషాన్ని ప్రభుత్వం మంగళవారం వెల్లడించనుండగా.. జనవరి 11 నాటికి ఉన్నటువంటి విదేశీ మారక నిల్వల సమాచారాన్ని శుక్రవారం ఆర్‌బీఐ తెలియజేయనుంది. ఇదే రోజున జనవరి 4 నాటికి మొత్తం డిపాజిట్లు, బ్యాంక్‌ రుణా ల వృద్ధి సమాచారాన్ని ఆర్‌బీఐ వెల్లడించనుంది.

ముడిచమురు ధరల ప్రభావం..
గతవారంలో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 6 శాతం ర్యాలీ చేశాయి. గతేడాది డిసెంబర్‌లో నమోదైన 50.5 డాలర్ల వద్ద నుంచి చూస్తే.. 20 శాతం పెరిగాయి. శుక్రవారం 60.55 వద్ద ముగియగా.. క్రూడ్‌ ధరల్లో ర్యాలీ కొనసాగితే దేశీ సూచీలకు ప్రతికూల అంశంకానున్నట్లు ఎక్సెల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ విరల్‌ బెరవాలా విశ్లేషించారు. ఇక ముడిచమురు ధర పెరుగుదల కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 70.49 వద్దకు చేరుకుంది.

అంతర్జాతీయ అంశాలు ఏంచేస్తాయో..
అమెరికా–మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్‌ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్‌ ముగింపు ఎప్పుడనే విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు యురోపియన్‌ యూనియన్‌ నుంచి యూకే వైదొలిగే ప్రక్రియకు సంబంధించి మంగళవారం కీలక సమాచారం వెల్లడికానుంది. యూకే ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్‌ ఉపసంహరణ డీల్‌పై బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఓటు వేయనుంది. ఇక గతవారంలో అమెరికా–చైనాల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. ఈ చర్చల సారాంశం ఏంటనే విషయంపై స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు..
ఈనెలలోని గడిచిన తొమ్మిది సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.3,600 కోట్లను ఉపసంహరించుకున్నారు. జనవరి 1–12 కాలంలో రూ.3,677 కోట్లను వీరు వెనక్కుతీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top