
ముంబై: ఇండిగో విమానయాన సంస్థను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 56 శాతం ఎగసింది. గత క్యూ3లో రూ.487 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.762 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఆదాయ నిర్వహణ ఉత్తమంగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ చెప్పారు. ఆదాయం రూ.4,986 కోట్ల నుంచి 24% వృద్ధితో రూ.6,178 కోట్లకు పెరిగిందని తెలిపారు. ప్రయాణికుల టికెట్ల ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.5,322 కోట్లకు, ఇతర ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.700 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.
ఏటీఆర్‌లతో ప్రాంతీయ సర్వీసులు....
ఏటీఆర్ విమానం ద్వారా ప్రాంతీయ విమాన సర్వీసులను అందించడం అరంభించామని, భారత్‌లో మరిన్ని నగరాలకు తమ సర్వీసులను విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ క్యూ3 తమకు ప్రత్యేకమైనదని, 20 కోట్ల మందికి విమాన సర్వీసులందజేశామని వివరించారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈలో ఇండిగో షేర్ 3.7 శాతం లాభంతో రూ.1,238 వద్ద ముగిసింది.