
ఇండిగో లాభం నాలుగింతలు
విమానయాన సంస్థ ఇండిగో గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,304 కోట్ల నికర లాభం ఆర్జించింది...
- కంపెనీ చరిత్రలోనే అత్యధికం ఇది..
- వరుసగా ఏడో ఏడాదీ లాభాలే
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,304 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధిక వార్షిక వృద్ధి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.317 కోట్లు)తో పోల్చితే నాలుగింతల వృద్ధిని నమోదు చేసింది. వరుసగా ఏడు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీకి లాభాలు వచ్చాయి. సంస్థ త్వరలో ఐపీఓ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించనున్నది. దేశీయ విమానయాన రంగంలో తీవ్రమైన ఒడిదుడుకులున్నప్పటికీ, అధిక రాబడులతో ఇండిగో కంపెనీ మంచి నికర లాభం సాధించింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రాబడులు 25 శాతం వృద్ధితో రూ.14,320 కోట్లకు పెరిగాయి. ఈ విమానయాన సంస్థలో ఇంటర్‌గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్‌కు చెందిన రాహుల్ భాటియాకు 51 శాతం వాటా ఉంది. కాగా రూ.2,500 కోట్ల సమీకరణ నిమిత్తం ఈ కంపెనీ త్వరలో ఐపీఓకు రానున్నది.