
ముంబై: ఇండిగో పేరుతో విమానయాన సర్వీసులను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో ఏకంగా నాలుగింతలు పెరిగింది. గత క్యూ2లో రూ.140 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 294 శాతం లాభంతో రూ.552 కోట్లకు చేరుకుంది.
విమానాలు డెలివరీ చేయడంలో ఆలస్యమైనందుకు ఎయిర్‌బస్, ఇంజిన్‌లో సమస్యల కారణంగా ఎనిమిది విమానాలను వాడకుండా నిలిపేసేందుకు ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ పరిహారాలు చెల్లించడం, మార్జిన్లు అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ తెలిపింది. అయితే ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు ఏ మేరకు పరిహారం చెల్లించాయో కంపెనీ వెల్లడించలేదు.
మొత్తం ఆదాయం రూ.5,506 కోట్లు
గత క్యూ2లో 3.4%గా ఉన్న మార్జిన్లు ఈ క్యూ2లో 7 శాతం వృద్ధితో 10.4%కి పెరిగాయని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ పేర్కొంది. ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.5,291 కోట్లకు చేరాయి. ఇక మొత్తం ఆదాయం రూ.4,328 కోట్ల నుంచి 27% వృద్ధితో రూ.5,506 కోట్లకు పెరిగింది. లోడ్ ఫ్యాక్టర్ 1.8 శాతం వృద్ధితో 84 శాతానికి చేరుకుంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.1,244 వద్ద ముగిసింది.