వృద్ధి చక్రాలు వెనక్కి!

వృద్ధి చక్రాలు వెనక్కి! - Sakshi


2017–18 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతమే

మూడేళ్ల కనిష్ట స్థాయికి; అంచనాలను మించిన పతనం

నోట్ల రద్దు ప్రభావమేనన్న విశ్లేషకులు

అంతక్రితం త్రైమాసికంలో ఇది 6.1 శాతం

2016–17 తొలి త్రైమాసికంలో ఏకంగా 7.9 శాతం  




న్యూఢిల్లీ: ఒకవైపు పన్ను సంస్కరణలు... మరోవైపు రివ్వున ఎగుస్తున్న స్టాక్‌ మార్కెట్లు... భారత ఆర్థిక వ్యవస్థ మెరిసిపోతున్నదనే సంకేతాలిస్తుండగా గురువారం వెలువడిన ఆర్థిక వృద్ధి రేటు గణాంకాలు మాత్రం దానిపై నీళ్లు చల్లేశాయి. 2017–18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్, క్యూ1) వృద్ధి కేవలం 5.7%గా నమోదయింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి– మార్చి మధ్య 4.6% కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తరవాత అత్యంత తక్కువ ఇదే. గతేడాది ఇదే కాలంలో నమోదైన వృద్ధి రేటు 7.9% కావటం గమనార్హం.



గతేడాది 4వ త్రైమాసికంలో కూడా 6.1% నమోదు కాగా... ఇపుడు దారుణంగా పడిపోవటం గమనార్హం. నవంబర్‌ 8న కేంద్రం రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేసిన ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుసగా 3 త్రైమాసికాల నుంచీ స్థూల దేశీయోత్పత్తి కిందకు జారుతోంది. నోట్ల రద్దు దెబ్బకు తయారీ రంగంలో ఉత్పత్తి భారీగా పడిపోవడం దీనికి ప్రధాన కారణం. తాజా గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసింది.



జీవీఏ 5.6 శాతమే..!

ఉత్పత్తి లేదా సరఫరాలవైపు నుంచి ఆర్థిక క్రియాశీలతను జీవీఏ(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌) గణాంకాలు సూచిస్తే, వినియోగపరంగా లేదా డిమాండ్‌ పరంగా ఉన్న పరిస్థితిని జీడీపీ గణాంకాలు సూచిస్తాయి. దీని ప్రకారం జీవీఏ 5.6%గా నమోదైంది. అంతక్రితం త్రైమాసికంలోనూ ఇదే స్థాయిలో ఉంది.



రంగాల వారీగా...

జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన తయారీ రంగం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ విభాగంలో జీవీఏ వార్షికంగా భారీగా 10.7 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది.



వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో (అటవీ, ఫిషింగ్‌ సహా) కూడా తొలి త్రైమాసికంలో వృద్ధి స్వల్పంగా తగ్గి, 2.5 శాతం నుంచి 2.3 శాతానికి చేరింది.



మైనింగ్‌: వృద్ధి 2.3 శాతం

క్వారీయింగ్‌: వృద్ధి లేకపోగా – 0.7  శాతం క్షీణత.

నిర్మాణం: 1.2 శాతం వృద్ధి

ఆర్థిక, బీమా, రియల్టీ: వృద్ధి 2 శాతం

వృత్తిపరమైన సేవలు: వృద్ధి రేటు 6.4 శాతం




బడ్జెట్‌ లక్ష్యంలో 92.4 శాతానికి ద్రవ్యలోటు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్‌ లక్ష్యంలో ద్రవ్యోలోటు జూలై నెలాఖరుకు 92.4 శాతానికి చేరింది. వివరాల్లోకి వెళితే, 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యం రూ.5,46,532 కోట్లు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలో 3.2 శాతం. దీనర్థం జీడీపీలో ద్రవ్యోలోటు 3.2 శాతం దాటకూడదన్నమాట (గత ఆర్థిక సంవత్సరం లక్ష్యం 3.5 శాతం) అయితే ఆర్థిక సంవత్సరం  జూలై నాటికే ద్రవ్యలోటు రూ.5.04  లక్షల కోట్లకు చేరింది. అంటే 2017–18 బడ్జెట్‌ అంచనాల్లో ఇది 92.4 శాతం అన్నమాట. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ నిష్పత్తి 73.7 శాతంగా ఉంది.



నోట్ల రద్దు కాదు... జీఎస్‌టీయే కారణం!!

ఈ ఏడాది జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కార్లు, ఎఫ్‌ఎంసీజీ, దుస్తులు సహా పలు రంగాలు ఉత్పత్తి చేయడాన్ని పక్కనబెట్టి, తమ వద్ద ఉన్న స్టాక్స్‌ విక్రయాలపై అధికంగా దృష్టి సారించాయి. ఇది జీవీఏ యథాతథంగా కొనసాగడానికి కారణమయ్యింది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి నిల్వలు తగ్గడం, కొత్త ఉత్పత్తులు జరక్కపోవడం, సంబంధిత సర్దుబాటు అంశాలు జీడీపీపై కూడా ప్రభావం చూపాయి. జీడీపీ వృద్ధి తగ్గడానికి ఈ అంశాలే కారణం తప్ప, నోట్ల రద్దు కాదు. ఇప్పుడు జీఎస్‌టీ అమలుతో వృద్ధి పునరుత్తేజానికి వీలవుతుంది.

– టీసీఏ అనంత్, చీఫ్‌ స్టాటిస్టీషియన్‌



పూర్తి ఏడాది 6.3 శాతమే..!

జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోవడం జీఎస్‌టీ ప్రభావం వల్లనే. నిజానికి నా అంచనాకన్నా ఇది 40 బేసిస్‌ పాయింట్లు తక్కువ. ఈ నేపథ్యంలో మొత్తం ఏడాది వృద్ధి 6.3%గా ఉంటుందని బావిస్తున్నా.

– ప్రణబ్‌ సేన్, మాజీ చీఫ్‌ స్టాటిస్టీషియన్‌



పరిస్థితులు మారాలి: పరిశ్రమలు

జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం పట్ల పారిశ్రామిక వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. వ్యాపారాలకు తగిన పరిస్థితుల కల్పన ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నట్లు పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు గోపాల్‌ జీవరాజ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు క్లిష్టమైన నిబంధనలను సడలించాల్సి ఉందనీ వివరించారు. కార్మిక చట్ట సంస్కరణలు జరగాలని, ఏకీకృత కార్మిక చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని కోరారు. ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణపై విధాన నిర్ణేతలు తక్షణం దృష్టి సారించాలని అసోచామ్‌ సూచించింది.



ఇంతకన్నా తగ్గదు

నిజానికి ఈ ఫలితం పట్ల కొంత ఆందోళన ఉంది. పరిశ్రమలు జీఎస్‌టీ కోసం చేసుకున్న ముందస్తు ఏర్పాట్ల వల్ల ఇది జరిగిందని భావిస్తున్నాం. వృద్ధి రేటు ఇంతకుమించి తగ్గదని భావిస్తున్నాం. భవిష్యత్‌ త్రైమాసికాల్లో భారీ వృద్ధిని సవాలుగా తీసుకుని, ఇందుకు తగిన చర్యలను కేంద్రం తీసుకుంటుంది. సేవల రంగం పుంజుకుంటుందని, పెట్టుబడులకు పునరుత్తేజం వస్తుందని భావిస్తున్నాం. వార్షిక జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని మా అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి, తగిన వర్షపాతం ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నాం. ఆర్థిక సంస్కరణల ఫలితాలూ అందివస్తాయి.   

 – అరుణ్‌జైట్లీ, ఆర్థిక మంత్రి



చైనాకన్నా వెనకబడ్డాం...

గత ఏడాది చివరి వరకూ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ నిలిచింది. అయితే ఈ ఏడాది (2017) తొలి రెండు త్రైమాసికాల్లో (జనవరి–జూన్‌) చైనా వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంది. భారత్‌లో మాత్రం ఇది జారుతూ వరుసగా ఈ రెండు త్రైమాసికాల్లో 6.1,  5.7 శాతాలుగా నమోదయ్యింది. దీనితో వృద్ధి వేగం విషయంలో చైనాతో పోల్చితే భారత్‌ వెనకబడినట్లయ్యింది.



ఎనిమిది రంగాల గ్రూప్‌ దిగాలు

పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా ఉన్న ఎనిమిది పరిశ్రమల గ్రూప్‌ జూలై గణాంకాలూ నిరాశాకరంగా ఉన్నాయి. ఈ నెల్లో ఈ రంగాల ఉత్పత్తి రేటు కేవలం 2.4 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 3.1 శాతం. వార్షికంగా ఎనిమిది రంగాల పనితీరునూ వేర్వేరుగా  చూస్తే...వృద్ధిలో...



సహజ వాయువు: ఈ రంగంలో  వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది.



బొగ్గు: ఉత్పత్తి వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 0.7 శాతానికి జారింది.



స్టీల్‌: అసలు వృద్ధి లేని స్థాయి నుంచి భారీగా 9.2 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.



విద్యుత్‌: వృద్ధి రేటు 2.1 శాతం నుంచి 5.4 శాతానికి ఎగసింది.



క్షీణతలో...

క్రూడ్‌ ఆయిల్‌: ఈ రంగంలో అసలు వృద్ధి లేదు.  క్షీణతలో కొనసాగుతోంది. –0.5 శాతం క్షీణత మరింతగా –1.8 శాతం క్షీణతకు జారింది.



రిఫైనరీ ప్రొడక్టులు: 8 శాతం వృద్ధి రేటు –2.7 క్షీణతలోకి పడిపోయింది.



ఎరువులు: క్రూడ్‌ ఆయిల్‌ తరహాలోనే ఈ రంగంలో కూడా క్షీణత –0.3 శాతం నుంచి –3.2 శాతానికి పెరిగింది.



సిమెంట్‌: ఈ రంగంలో కూడా 0.7 శాతం వృద్ధి –2 శాతం క్షీణతకు పడింది.



Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top