విదేశీ పెట్టుబడులకు గాలం

India plans incentives to bring in foreign firms - Sakshi

భారీ ప్రోత్సాహకాలపై కేంద్రం కసరత్తు

324 విదేశీ దిగ్గజ సంస్థలపై దృష్టి

జాబితాలో టెస్లా, గ్లాక్సో తదితర కంపెనీలు

అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత్‌ దృష్టి సారిస్తోంది. బహుళజాతి సంస్థ(ఎంఎన్‌సీ)లను రప్పించేందుకు తీసుకోతగిన చర్యలపై కసరత్తు చేస్తోంది.  టెస్లా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్‌ వంటి 324 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే సంస్థలకు స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు, రోడ్డు మార్గం వంటి సదుపాయాలు కూడా కల్పించడం తదితర అంశాలు వీటిలో ఉన్నాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ఈ మేరకు ఒక ముసాయిదా రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికన్‌ దిగ్గజం ఎలీ లిలీ అండ్‌ కో, దక్షిణ కొరియాకు చెందిన హన్వా కెమికల్‌ కార్పొరేషన్, తైవాన్‌ సంస్థ హాన్‌ హాయ్‌ ప్రెసిషన్‌ ఇండస్ట్రీ తదితర దిగ్గజ కంపెనీలతో కేంద్రంలోని ఉన్నతాధికారులు సంప్రదింపులు జరపనున్నట్లు వివరించాయి.

భూ, కార్మిక చట్టాలతోనే సవాలు...
వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. వియత్నాం, మలేషియా వంటి దేశాలను ఎంచుకుంటున్నాయి. కఠినమైన భూసేకరణ నిబంధనలు, కార్మిక చట్టాలున్న కారణంగా భారత్‌ను పక్కన పెడుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు.. తామే స్థలాన్ని సేకరించుకోవాల్సి ఉంటోంది. అయితే, వివిధ కారణాల రీత్యా దీనికి చాలా సమయం పట్టేస్తుండటంతో అసలు ప్రాజెక్టును ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఇన్వెస్ట్‌ చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇలాంటి ప్రతికూలాంశాలను గుర్తించిన కేంద్రం.. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు తీసుకోతగిన చర్యలపై దృష్టి పెడుతోంది.   

ప్రతిపాదనలు ఇవీ...
ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనువైన పారిశ్రామిక క్లస్టర్స్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తుంది. అలాగే పెట్టుబడులు, ఎంచుకున్న ప్రాంతం ప్రాతిపదికగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. యాంటీ–డంపింగ్‌ సుంకాలను క్రమబద్ధీకరిస్తుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాలు, ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల తయారీకి ప్రోత్సాహకాలు ఉంటాయి. అటు ఎలక్ట్రానిక్స్, టెలికం రంగాలకు సంబంధించి ఉద్యోగాలపరమైన వెసులుబాట్లు, పెట్టుబడుల ప్రాతిపదికన తయారీ సంబంధ ప్రోత్సాహకాలు మొదలైనవి పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ ప్రధాని కార్యాలయం పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ దిశగా...
2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్‌ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వృద్ధికి దోహదపడే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఎగుమతులను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటు తగ్గించడం, విదేశీ పెట్టుబడుల నిబంధనలు సడలించడం తదితర సంస్కరణలు ప్రవేశపెట్టింది. వీటి ఊతంతో వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంటోంది. ప్రపంచ బ్యాంక్‌ రూపొందించే ఈ లిస్టులో 2017 నుంచి ఏకంగా 37 ర్యాంకులు పైకి ఎగబాకింది. అయినప్పటికీ రువాండా, కొసొవో వంటి దేశాల కన్నా ఇంకా దిగువనే 63వ ర్యాంకులో ఉంది. దీంతో మరిన్ని సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top