
ఆదాయపు పన్ను 29 బ్యాంకుల శాఖల్లో చెల్లించొచ్చు
భారీ క్యూలలో వేచిచూడడాన్ని నివారించడానికి ఆదాయ పన్ను(ఐటీ)ను ముందుగానే చెల్లించాల్సిందిగా ప్రజలను రిజర్వ్ బ్యాంక్ కోరింది.
ముంబై: భారీ క్యూలలో వేచిచూడడాన్ని నివారించడానికి ఆదాయ పన్ను(ఐటీ)ను ముందుగానే చెల్లించాల్సిందిగా ప్రజలను రిజర్వ్ బ్యాంక్ కోరింది. ‘ఐటీ చెల్లింపుల స్వీకరణకు 29 ఏజెన్సీ బ్యాంకులకు అనుమతి ఇచ్చాం. ఆర్‌బీఐలో లేదా ఈ బ్యాంకుల శాఖల్లో ఐటీ బకాయిలను ముందుగానే చెల్లించండి...’ అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సూచిం చింది.
ఆన్‌లైన్‌లోనూ చెల్లించవచ్చని తెలిపింది. ప్రతి సెప్టెంబర్ చివర్లో ఐటీ చెల్లించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారనీ, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ రశీదులు ఇవ్వడం కష్టసాధ్యంగా మారిందనీ పేర్కొంది. ఐటీ చెల్లింపుల స్వీకరణకు ఆర్‌బీఐ అనుమతించిన బ్యాంకుల్లో అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఎస్‌బీహెచ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఓబీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్‌బీ తదితర బ్యాంకులు ఉన్నాయి. ఎంపికచేసిన శాఖలు లేదా ఆయా బ్యాంకులు ఆఫర్ చేసే ఆన్‌లైన్ చెల్లింపు సదుపాయం ద్వారా పన్ను చెల్లించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.
కేవైసీ పోస్టర్ విడుదల...
కేవైసీ నిబంధనల గురించి ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఒక నోట్‌ను, పోస్టర్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది. సామాన్యులు సైతం బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వీలుగా కేవైసీ నిబంధనలను ఇటీవల సరళతరం చేశామనీ, ఆ వివరాలు ప్రజలకు తెలపడమే పోస్టర్ ఉద్దేశమనీ పేర్కొంది. కాగా, బ్యాంకుల్లో మోసాల నివారణకు నిరంతర నిఘా పెడతామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ తెలిపారు.