ఇక బీమా ఐపీవోల జాతర! | ICICI Lombard gets SEBI approval for Rs. 6000 cr IPO | Sakshi
Sakshi News home page

ఇక బీమా ఐపీవోల జాతర!

Sep 6 2017 1:34 AM | Updated on Sep 17 2017 6:26 PM

ఇక బీమా ఐపీవోల జాతర!

ఇక బీమా ఐపీవోల జాతర!

బీమా రంగానికి చెందిన మరిన్ని సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీవో) చకచకా సిద్ధమవుతున్నాయి.

ఐసీఐసీఐ లాంబార్డ్, రిలయన్స్‌ ఇష్యూలకు ఓకే
► బరిలో మరో నాలుగు సంస్థలు
► జనరల్‌ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా,ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌
► ఇప్పటికే లిస్టయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌  


న్యూఢిల్లీ: బీమా రంగానికి చెందిన మరిన్ని సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీవో) చకచకా సిద్ధమవుతున్నాయి. తాజాగా ఐసీఐసీఐ లాంబార్డ్‌ తలపెట్టిన పబ్లిక్‌ ఇష్యూకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దేశీయంగా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సంబంధించి ఇదే తొలి ఐపీవో కానుంది. మరోవైపు, రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రతిపాదనకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది.

ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు ఐపీవో యోచనలో ఉంది. అలాగే ప్రభుత్వ రంగానికి చెందిన సాధారణ బీమా సంస్థలైన జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ కూడా పబ్లిక్‌ ఇష్యూల బరిలో ఉన్నాయి. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవోలకు సంబంధించి ఐఆర్‌డీఏ నుంచి మరింత స్పష్టత కోసం సెబీ ఎదురుచూస్తోంది. ఇక ఎస్‌బీఐ లైఫ్‌ విషయంలో ఐఆర్‌డీఏ నుంచి అవసరమైన వివరాలు ఆగస్టు 28న సెబీకి అందాయి. ప్రస్తుతం బీమా రంగం నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ సంస్థ స్టాక్‌ ఎక్సే్ఛంజీల్లో లిస్టయి ఉంది. హోల్డింగ్‌ కంపెనీ మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ వెంచర్‌ ద్వారా మ్యాక్స్‌ లైఫ్‌ పరోక్షంగా లిస్టయి ఉంది.

6,000 కోట్ల ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఇష్యూ..
ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఇష్యూ పరిమాణం సుమారు రూ.6,000 కోట్లు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్,  కెనడాకి చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ కలిసి ఈ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. రూ. 10 ముఖ విలువ గల 8,62,47,187 ఈక్విటీ షేర్లను ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవోలో విక్రయించనుంది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో పాటు ఐసీఐసీఐ లాంబార్డ్‌ కూడా జూలైలో ఐపీవో ముసాయిదా పత్రాలను సెబీకి దాఖలు చేశాయి. తాజాగా సెప్టెం బర్‌ 1న ఐసీఐసీఐ లాంబార్డ్‌ ప్రతిపాదనకు సెబీ ఆమోదం లభించింది.

25% వాటాల విక్రయంలో రిలయన్స్‌ జనరల్‌..
ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో సుమారు 25% దాకా వాటాలు విక్రయించాలని యోచిస్తోంది మాతృసంస్థ రిలయన్స్‌ క్యాపిటల్‌. కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు రూ. 7,000 కోట్లు ఉండొచ్చని అంచనా. అగ్ని ప్రమాదాలు మొదలుకుని పంట, ప్రయాణ బీమా దాకా వివిధ సాధారణ బీమా పథకాలను ఈ సంస్థ అందిస్తోంది. ప్రధాన్‌ మంత్రి ఫసల్‌ బీమా యోజన వంటి పంటల బీమాకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల్లో ఇది కూడా భాగం. 2016–17లో వ్యాపారం 41% పెరిగింది. స్థూల ప్రత్యక్ష ప్రీమియం రూ. 3,935 కోట్లకు పెరగ్గా, పన్నులకు ముందు లాభం 32 శాతం వృద్ధితో రూ. 130 కోట్లకు చేరింది.

సెబీ పరిశీలనలో ఇతర ఇష్యూలు..
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆగస్టు 18న ఐపీవో ముసాయిదా పత్రాలు సమర్పించింది. దీని విలువ సుమారు రూ. 7,500 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇక న్యూ ఇండియా అష్యూరెన్స్‌ ఇష్యూ కింద 9.6 కోట్ల షేర్ల విక్రయంతో పాటు, కొత్తగా 2.4 కోట్ల షేర్లను ప్రభుత్వం జారీ చేయనుంది. ఆగస్టు 8న కంపెనీ ఐపీవో ప్రాస్పెక్టస్‌ను సెబీకి దాఖలు చేసింది. ఈ ఆఫర్‌తో ప్రభుత్వానికి సుమారు రూ. 6,500 కోట్లు రాగలవని అంచన.

అలాగే జీఐసీ ఆర్‌ఈ ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 10.7 కోట్ల షేర్లను విక్రయించడంతో పాటు 1.7 కోట్ల మేర కొత్త షేర్లను జారీ చేయనుంది. ఈ కంపెనీ ఆగస్టు 7న సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. జీఐసీ ఇష్యూ కూడా దాదాపు న్యూ ఇండియా అష్యూరెన్స్‌ స్థాయిలో నిధులు సమకూర్చగలదని అంచనా. ఆగస్టు 16న న్యూ ఇండియా అష్యూరెన్స్‌ ఇష్యూపై,  ఆగస్టు 21న జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఐపీవోపై, ఆగస్టు 23న హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ పబ్లిక్‌ ఆఫర్‌పై స్పష్టత కోసం మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ ఐఆర్‌డీఏని సెబీ కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement