చందాకొచర్‌కు ఐసీఐసీఐ బోర్డు బాసట

ICICI board backs Chanda Kochhar amidst questions over Videocon - Sakshi

వీడియోకాన్‌ రుణ వివాదంలో  క్విడ్‌ ప్రో కో లేదని వివరణ

న్యూఢిల్లీ: రుణాల మంజూరు విషయంలో వీడియోకాన్‌ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్‌కు బ్యాంకు బోర్డు బాసటగా నిల్చింది. ఇవన్నీ దురుద్దేశపూర్వకమైన, నిరాధారమైన వదంతులేనని స్పష్టం చేసింది. కొచర్‌పై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని పేర్కొంది. రుణాలను ఆమోదించే విషయంలో తమ బ్యాంకు అంతర్గత వ్యవస్థ పటిష్టంగా ఉందని బోర్డు పేర్కొంది.

క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలివ్వడం ద్వారా కొచర్, ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారంటూ ఒక వెబ్‌సైట్‌లో వార్తలొచ్చిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఈ మేరకు వివరణనిచ్చింది. ఆరోపణల్లో పేర్కొంటున్నట్లుగా వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు చందా కొచర్‌ ఎటువంటి లబ్ధి పొందలేదని.. ఈ వ్యవహారంలో క్విడ్‌ ప్రో కో గానీ ఆశ్రిత పక్షపాతం గానీ స్వార్థ ప్రయోజనాలు గానీ లేవని స్పష్టం చేసింది.

బ్యాంకు, టాప్‌ మేనేజ్‌మెంటును అప్రతిష్ట పాలు చేసేందుకే కొన్ని స్వార్థ శక్తులు వదంతులను వ్యాపింపచేస్తున్నాయని బోర్డు తెలిపింది. 2012 ఏప్రిల్‌లో వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చిన కన్సార్షియంలో తమది లీడ్‌ బ్యాంక్‌ కూడా కాదని పేర్కొంది. కన్సార్షియంలో భాగంగానే సుమారు రూ.3,250 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇది కన్సార్షియం ఇచ్చిన మొత్తం రుణంలో 10 శాతం కన్నా తక్కువేనని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top