
వావ్ ఎయిర్ (ఫైల్ ఫోటో)
దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాకు, కెనడాకు కేవలం రూ.13,499కే ప్రయాణించవచ్చట. అదెలాగో తెలుసా? ఐస్‌లాండ్ కేంద్రంగా పనిచేసే విమానయాన సంస్థ ‘వావ్ ఎయిర్’ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘వావ్ ఎయిర్’ తాను ప్రకటించిన ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.13,499కే ఢిల్లీ నుంచి అమెరికాలోని చికాగో, ఓర్లాండో, డెట్రాయిట్, శాన్‌ఫ్రాన్సిస్కో, బోస్టన్, పిట్సుబర్గ్, లాస్ ఏంజెల్స్, వాషింగ్టన్ డీసీ, నెవార్క్, సెయింట్ లూయిస్, బాల్టిమోర్ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చని తెలిపింది. అంతేకాక కెనడాలో పలు ప్రాంతాలకు కూడా ఇదే అవకాశాన్ని అందిస్తుంది. టోరంటో, మాంట్రియల్‌కు కూడా కంపెనీ విమానాలు నడపనుంది. ఈనెల 18న మొదలైన టికెట్ల విక్రయం 28న ముగుస్తుంది. ఈ ఏడాది డిసెంబరు నుంచి 2019 మార్చి మధ్యలో ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
డిసెంబరు 7న ఢిల్లీ నుంచి ఐస్‌లాండ్‌లోని సంస్థ ప్రధాన కేంద్రమైన రేజావిక్‌కూ విమానాలను ప్రారంభించనున్నట్లు ‘వావ్ ఎయిర్’ తెలిపింది. వయా రేజావిక్ ద్వారా ఢిల్లీ నుంచి ఉత్తర అమెరికా, యూరప్‌లకు ప్రయాణికులను కనెక్ట్ చేయడానికి మూడు వీక్లి విమానాలను నడుపనున్నట్టు పేర్కొంది. జనవరి నుంచి వీటిని వారానికి అయిదు సార్లకు పెంచనుంది. ప్రతి రోజూ ఉత్తర అమెరికా, భారత్‌ల మధ్య 20వేల మంది ప్రయాణిస్తూ ఉంటారని వావ్ ఎయిర్ చెప్పింది. భారత్‌లోకి ఎగురుతున్న తొలి సదూర విమానయాన సంస్థ ఇదేనని వావ్ ఎయిర్ వ్యవస్థాపకుడు, సీఈవో తెలిపారు. మరిన్ని భారతీయ నగరాల్లో తమ స్టేషన్లను విస్తరిస్తామని చెప్పారు.