గుజరాత్‌ పిపా‘వావ్‌’- బాంబే డయింగ్‌ బోర్లా | Gujarat pipavav up- Bombay dyeing plunges | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ పిపా‘వావ్‌’- బాంబే డయింగ్‌ బోర్లా

Jun 10 2020 1:32 PM | Updated on Jun 10 2020 1:32 PM

Gujarat pipavav up- Bombay dyeing plunges - Sakshi

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో నౌకాశ్రయ సేవల కంపెనీ గుజరాత్‌ పిపావవ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో పనితీరు నిరుత్సాహపరచడంతో టెక్స్‌టైల్స్‌ కంపెనీ బాంబే డయింగ్‌ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. వెరసి గుజరాత్‌ పిపావవ్‌ కౌంటర్‌ భారీ లాభాలతో సందడి చేస్తోంటే.. బాంబే డయింగ్‌ షేరు నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

గుజరాత్‌ పిపావవ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రయివేట్‌ రంగ కంపెనీ గుజరాత్‌ పిపావవ్‌ రూ. 54 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 9 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 10 శాతం తక్కువగా రూ. 162 కోట్లకు చేరింది. అయితే పూర్తిఏడాదికి(2019-20) కంపెనీ నికర లాభం 35 శాతం ఎగసి రూ. 319 కోట్లను అధిగమించింది. అమ్మకాలు సైతం 5 శాతం పెరిగి రూ. 735 కోట్లను తాకాయి. వాటాదారులకు షేరుకి రూ. 3.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ పిపావవ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 71.7 వద్ద ట్రేడవుతోంది.

బాంబే డయింగ్‌ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో టెక్స్‌టైల్‌ రంగ కంపెనీ బాంబే డయింగ్‌ లిమిటెడ్‌ రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 96 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 89 శాతం తక్కువగా రూ. 313 కోట్లకు చేరింది. కాగా.. పూర్తిఏడాదికి(2019-20) కంపెనీ నికర లాభం 73 శాతం పడిపోయి రూ. 329 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 57 శాతం నీరసించి రూ. 1895 కోట్లను తాకింది. ఈ కాలంలో రూ. 25 కోట్ల ఇబిటా నష్టం వాటిల్లింది. వాటాదారులకు షేరుకి రూ. 0.2 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాంబే డయింగ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం పతనమై రూ. 64 వద్ద ట్రేడవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement