10 గ్రాముల పసిడి రూ.38వేలకు | Gold Rate: Gold inches lower on muted spot demand | Sakshi
Sakshi News home page

పసిడే పదిలం..!

Mar 28 2019 12:00 AM | Updated on Apr 4 2019 5:04 PM

Gold Rate: Gold inches lower on muted spot demand - Sakshi

అగ్రరాజ్యం అమెరికా మళ్లీ మాంద్యంలోకి జారిపోనుందన్న భయాలు ఒకవైపు ప్రపంచ దేశాల వృద్ధి మందగించవచ్చన్న ఆందోళన మరోవైపు.. ఇన్వెస్టర్లను మళ్లీ పసిడి వైపు మళ్లేలా చేస్తున్నాయి. పదేళ్ల అమెరికా ట్రెజరీ బాండ్‌ రేటు.. మూడు నెలల రేట్ల కన్నా దిగువకి పడిపోవడం... అగ్రరాజ్యంలో మాంద్యం రాబోతోందనడానికి గట్టి నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడివైపు చూడటానికి కూడా ఇదొక కారణం కాగలదని వారంటున్నారు. ఇక అమెరికా డాలరు, బంగారం ధరలు వ్యతిరేక దిశల్లో నడుస్తుంటాయి. ఉదాహరణకు  డాలరు పెరిగితే పసిడి రేటు తగ్గడం, డాలరు బలహీనపడితే బంగారం రేటు పెరగడం జరుగుతుంటుంది. డాలరు బలహీనపడిన పక్షంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు పసిడిని ఎంచుకుంటూ ఉండటమే ఇందుకు కారణం.

వృద్ధి మందగమనం...
డాలరు బలహీనత నేపథ్యంలో గడిచిన మూడు వారాలుగా భారత్‌లో పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ్ర»ñ గ్జిట్‌పై అనిశ్చితి, ప్రపంచ దేశాల వృద్ధి మందగించవచ్చన్న అంచనాలు కూడా ఇందుకు కొంత కారణం. అమెరికా విషయానికొస్తే.. గత వారంలో విడుదలైన డేటా ప్రకారం.. మార్చిలో తయారీ కార్యకలాపాలు అనూహ్యంగా మందగించాయి. యూరోజోన్‌లో వ్యాపా రాల పనితీరు .. అంచనాల కన్నా తక్కువ స్థాయిలో ఉంది. దీంతో అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోలో పసిడిని పెంచుకోవడం శ్రేయస్కరమని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే 12 నెలల వ్యవధిలో దేశీయంగా బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 38,000 స్థాయిని తాకే అవకాశాలు ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ (కమోడిటీస్‌) కిశోర్‌ నార్నె తెలిపారు. ప్రస్తుతం పసిడి రేటు రూ. 32,700 స్థాయిలో కదలాడుతోంది.  

అయిదేళ్లుగా దూరం.. 
పసిడిపై రాబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఈక్విటీ మార్కెట్లు భారీ రాబడులు అందిస్తుండటం వంటి అంశాల కారణంగా గడిచిన అయిదేళ్లుగా చాలా మంది ఇన్వెస్టర్లు పసిడి నుంచి తప్పుకుంటూ వస్తున్నారు. గత అయిదేళ్ల గణాంకాలు చూస్తే పసిడిపై రాబడి ఒక మోస్తరుగా లేదా.. ఒకే స్థాయిలో ఉండిపోగా, ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సూచీ 11.37 శాతం మేర రాబడులు ఇచ్చింది. అయితే, తాజా పరిస్థితులను బట్టి చూస్తే.. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో సుమారు 5–10 శాతాన్ని బంగారానికి కేటాయించే అంశం పరిశీలించవచ్చని వెల్త్‌ మేనేజర్లు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు విషయంలో కఠిన వైఖరి కాకుండా కాస్త ఆచితూచి వ్యవహరించాలని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ యోచిస్తుండటాన్ని చూస్తే అక్కడి ఎకానమీ వృద్ధి కొంత మందగిస్తోందని భావించవచ్చని ప్లాన్‌ ఎహెడ్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు విశాల్‌ ధావన్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పోర్ట్‌ఫోలియోల్లో పసిడికి చోటు కల్పించే అవసరం ఉంటుందని వివరించారు. 

పది శాతం దాకా కేటాయింపులు.. 
మరీ ఎక్కువగా రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 10 శాతం దాకా నిధులను బంగారానికి కేటాయించవచ్చని విశాల్‌ ధావన్‌ సూచించారు. అది కూడా ఏకమొత్తంగా కాకుండా క్రమంగా మూడు నెలల వ్యవధిలో పుత్తడిలో కొనుగోళ్లు జరపవచ్చని తెలిపారు. నాణేలు, కడ్డీలు వంటి భౌతిక రూపంలోని పసిడి కొనుగోళ్ల కన్నా గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, ప్రభుత్వం జారీ చేసే సార్వభౌమ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీ)మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చని ధావన్‌ వివరించారు. వీటిల్లోనూ ఈటీఎఫ్‌ల కన్నా.. పసిడి రేటుకు మించి కొంత అధికంగా 2.5 శాతం మేర వడ్డీ చెల్లించే సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ను పరిశీలించవచ్చని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement