
ఈ ఏడాదే అటో..ఇటో!
డీమోనిటైజేషన్ తదితర సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ మనుగడకు ఈ ఏడాది చాలా ముఖ్యమైనదని, అటో ఇటో తేలిపోగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
• ప్రభుత్వానికి కీలకంగా మారిన సంస్కరణలు
• 8 శాతం పైగా వృద్ధికి చర్యలు ముఖ్యం
• డీమోనిటైజేషన్ నిధుల సద్వినియోగం ప్రధానం
• కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాలి
• బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు ప్రక్షాళన చేయాలి
• కొత్త ఏడాదిపై విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ తదితర సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వ మనుగడకు ఈ ఏడాది చాలా ముఖ్యమైనదని, అటో ఇటో తేలిపోగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అందుబాటులోకి వచ్చే రూ. 2.20 లక్షల కోట్లను 8 శాతం స్థాయి ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకుంటుందనేది చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. సమీప భవిష్యత్‌లో 8 శాతం వృద్ధి సాధించాలంటే.. ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయడం, మౌలిక సదుపాయాల కల్పనపై మరిన్ని నిధులు వెచ్చించడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.
‘2017–18 సంవత్సరం ప్రభుత్వానికి కీలకం. డీమోనిటైజేషన్ విజయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బ్లాక్ ఎకానమీని అధికారిక ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తీసుకురాగలిగిన పక్షంలో దీర్ఘకాలంలో వడ్డీ రేట్లు తగ్గగలవు. తద్వారా భారత్ 8–8.5 శాతం వృద్ధి సాధించేందుకు ఊతం లభించగలదు’ అని కేపీఎంజీ (ఇండియా) పార్ట్‌నర్ గిరీష్ వన్వారీ వ్యాఖ్యానించారు.
ఆర్థిక ప్యాకేజీ అవకాశాలు..
ప్రస్తుతం దేశీయంగా పెట్టుబడులు మందగమన దశలో సాగుతున్నాయని, పెద్ద నోట్ల రద్దు దెబ్బతో వినియోగం కూడా మందగించిందని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు కనుక వచ్చే ఆర్థిక సంవత్సరం ఏదైనా ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీల్లాంటివి ప్రతిపాదించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా వచ్చిపడిన అనధికారిక డిపాజిట్లపై పన్నులు, ఇతరత్రా వనరుల ద్వారా ప్రభుత్వానికి రూ. 2.2 లక్షల కోట్ల మేర నిధులు (స్థూల దేశీయోత్పత్తిలో 1.5 శాతం) రావొచ్చని అంచనా వేశారు. వ్యయాలు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఈ నిధులు సరిపోగలవని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఉపాధికి ఊతమిచ్చే విధంగా.. రోడ్లు, రైల్వేస్, ఇతరత్రా నిర్మాణ రంగ ప్రాజెక్టులపై వ్యయాల రూపంలో ఆర్థిక ప్యాకేజీ ఉండవచ్చని ఆయన వివరించారు.
సవాళ్లు ఇవీ...: ప్రభుత్వం ముందు ప్రస్తుతం మూడు ప్రధాన సవాళ్లున్నాయని, వీటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. డీమోనిటైజేషన్ ప్రభావాలు మార్చి ఆఖరు దాకా కొనసాగే అవకాశముందని వివరించారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలు; వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు అంశాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. సంస్కరణల అజెండాను కొనసాగిస్తూ.. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం, డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించడం, బ్యాం కులు మొండిపద్దులను ప్రక్షాళన చేయడం, వెలికితీసిన నల్లధనాన్ని ఇన్‌ఫ్రాను మెరుగుపర్చేందుకు వెచ్చిం చడం వంటి చర్యలు తీసుకోవచ్చని వన్వారీ తెలిపారు.
ఒకవేళ వెలికి తీసిన నల్లధనం కూడా వ్యవస్థలోకి వచ్చిన పక్షంలో వడ్డీ రేట్లు మరింతగా తగ్గి.. వృద్ధి 8–8.5% స్థాయి వైపుగా వెళ్లగలదని వన్వారీ చెప్పారు. మరోవైపు బ్యాంకుల్లోకి పెద్ద యెత్తున నిధులు వచ్చి పడిన నేపథ్యంలో ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడంపై దృష్టి పెట్టొచ్చని, అమెరికా.. బ్రిటన్‌లో ఉన్న స్థాయుల్లోకి తీసుకురావొచ్చని శ్రీవాస్తవ తెలిపారు. తద్వారా పెట్టుబడులు తరలిపోకుండా చూడొచ్చన్నారు. ఇక ఖర్చులు చేయగలిగేంత నిధులు ప్రజల చేతుల్లో ఉండే విధంగా రాబోయే బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని రూ. 3 లక్షలకు పెంచాలని సూచించారు.
’భారత ఎకానమీ ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం మేర, వచ్చేసారి 7.4 శాతం మేర వృద్ధి చెందగలదని భావిస్తున్నాను. డీమోనిటైజేషన్, జీఎస్‌టీ అమలు, ఆర్థిక సంవత్సరం లెక్కింపు విధానం మార్పు మొదలైనవన్నీ పూర్తయిపోయి, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత రెండేళ్ల వ్యవధిలో భారత్ 8 శాతం స్థాయి వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి’ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు.