బ్యాంకుల చీఫ్‌లతో నేడు జైట్లీ భేటీ

FM Jaitley to meet PSB chiefs tomorrow to review performance - Sakshi

ఆర్థిక పనితీరుపై సమీక్ష

మొండిబాకీల రికవరీపై దృష్టి  

న్యూఢిల్లీ: వార్షిక ఆర్థిక పనితీరు సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో భేటీ కానున్నారు. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తీసుకుంటున్న చర్యల పురోగతితో పాటు పలు అంశాలు ఇందులో చర్చకు వస్తాయని  సంబంధిత వర్గాలు తెలిపాయి.

రుణ వృద్ధి, బాకీల రికవరీకి తీసుకుంటున్న చర్యలు, చట్టపరంగా ప్రభుత్వం అందించే తోడ్పాటు మొదలైనవి కూడా చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి.మొండిబాకీలను రాబట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న బ్యాంకులు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇప్పటికే రూ. 36,551 కోట్లు రాబట్టాయి.

గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వసూలైన మొండిబాకీలతో పోలిస్తే ఇది 49 శాతం అధికం. మూడు పీఎస్‌బీలను (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా, దేనా బ్యాంక్‌) విలీనం చేయాలంటూ ప్రత్యామ్నాయ యంత్రాంగం సిఫార్సు చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2017–18లో పీఎస్‌బీల నష్టాలు రూ. 87,357 కోట్ల పైచిలుకు నమోదయ్యాయి. 21 పీఎస్‌బీల్లో రెండు మాత్రమే (ఇండియన్‌ బ్యాంక్, విజయా బ్యాంక్‌) లాభాలు ప్రకటించాయి.

ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ కోసం చర్యలు: జైట్లీ
నిధుల కష్టాల వార్తలతో ఆర్థిక సంస్థల షేర్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), మ్యూచువల్‌ ఫండ్స్‌కి తగింత లిక్విడిటీ ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

సోమవారం స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభం కావడానికి ముందు..  మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్‌ చేశారు. రుణాలు బాకీ పడిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌తో పాటు లిక్విడిటీ సమస్యల వార్తలతో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు కుప్పకూలడం.. వాటితో పాటు మార్కెట్లు పతనం అవుతుండటం తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top