అదుపుతప్పిన ద్రవ్యలోటు

Fiscal deficit crosses 134% of budget estimate at February-end - Sakshi

లక్ష్యం 6.34 లక్షల కోట్లు ఫిబ్రవరి ముగింపుకే రూ.8.51 లక్షల కోట్లు

ఆర్థిక సంవత్సరంలో మరో నెల

లక్ష్యాన్ని దాటనివ్వమంటున్న కేంద్రం

న్యూఢిల్లీ:  ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లెక్కలు ఆందోళన సృష్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడం, వ్యయాలు పెరగడం దీనికి కారణం. శుక్రవారం విడుదలయిన కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ గణాంకాలను పరిశీలిస్తే... 

►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌ – 2019 మార్చి) మధ్య  ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ఉండాలని సంబంధిత బడ్జెట్‌ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 3.3 శాతం. 
►అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, 2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాలను 6.24 లక్షల కోట్ల నుంచి రూ.6.34 లక్షల కోట్లకు (జీడీపీలో 3.4 శాతం) పెంచారు. చిన్న సన్నకారు రైతుల ఆదాయ పథకానికి ఫండింగ్‌ వల్ల ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచాల్సి వచ్చిందని తన బడ్జెట్‌ ప్రసంగంలో గోయల్‌ తెలిపారు.  
​​​​​​​►అయితే ఫిబ్రవరి ముగిసే నాటికి (ఆర్థిక సంవత్సరం ఇంకా నెల ఉండగానే) ఈ లోటు రూ. 8.51 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే లక్ష్యం (రూ.6.34 లక్షల కోట్లు)లో 100 శాతం దాటిపోయి మరో 34.2 శాతం (134.2 శాతం) పెరిగిందన్నమాట.  
​​​​​​​►అయితే కేంద్రం మాత్రం ద్రవ్యలోటును సవరిత అంచనాలను (రూ.6.34 లక్షల కోట్లు) ఎంతమాత్రం దాటనివ్వమని స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం మరో నెల (మార్చి) కేంద్ర ఖజానాకు రానున్న ఆదాయం లోటును కట్టడి చేస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థికశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 

ఆర్‌బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? 
ద్రవ్యలోటును ఎలా పూడ్చుకోవాలన్న అంశంపై సర్వత్రా ఇప్పుడు చర్చ నెలకొంది.  ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సమాచారం.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top