కట్టుతప్పిన ఆదాయ–వ్యయాల వ్యత్యాసం!

India Apr-Aug fiscal deficit at over 109percent of budgetary target - Sakshi

బడ్జెట్‌ లక్ష్యాన్ని మించి ఆగస్టుకు 109.3 శాతానికి ద్రవ్యలోటు అప్‌

ఈ ధోరణి వరుసగా రెండవనెల

కరోనా ప్రేరిత అంశాల నేపథ్యం

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు అదుపులోనికి రాని పరిస్థితి నెలకొంది. వరుసగా రెండవ నెల ఆగస్టులోనూ బడ్జెట్‌ లక్ష్యాన్ని దాటిపోయి 109.3 శాతంగా నమోదయ్యింది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) బుధవారం వెల్లడించిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► 2020–21లో ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్లు ఉండాలని ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిర్దేశించింది. ఇది 2020–21 భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే 3.5 శాతం.  
► అయితే ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నాటికే ద్రవ్యోలోటు 109.3 శాతానికి అంటే రూ.8,70,347 కోట్లకు ఎగసింది.
► సీజీఏ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌–ఆగస్టు మధ్య ప్రభుత్వ మొత్తం ఆదాయాలు రూ.3,77,306 కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 16.8 శాతం మాత్రమే. ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.22.45 లక్షల కోట్ల ఆదాయాలు బడ్జెట్‌ లక్ష్యం.  
► ఇక వ్యయాలు రూ.12,47,653 కోట్లుగా ఉంది. 2020–21 బడ్జెట్‌ అంచనాల్లో ఇది 41 శాతం.  
► 2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతం. ఏడేళ్ల గరిష్ట స్థాయి ఇది. అయితే కరోనా పరిణామాలు, పేలవ ఆదాయాలు వంటి సవాళ్ల నేపథ్యంలో ద్రవ్యలోటు శాతం జీడీపీలో 2020–21లో భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని అంచనా ఉంది.

అక్టోబర్‌–మార్చి మధ్య రూ.4.34 లక్షల కోట్ల రుణ ప్రణాళిక
2020–21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (అక్టోబర్‌–మార్చి) మధ్య రూ.4.43 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. కరోనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, దీనితో ప్రభుత్వ ఆదాయాల అంచనాలకు గండి పడ్డం వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ చేసిన ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.12 లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది. సెప్టెంబర్‌ వరకూ రూ.7.66 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరిపింది. మిగిలిన రూ.4.34 లక్షల కోట్లను ద్వితీయార్థంలో సమీకరిస్తుంది. తన ద్రవ్యలోటును పూడ్చుకోడానికి కేంద్రం డేటెడ్‌ సెక్యూరిటీలు (నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన బాండ్లు) ట్రెజరీ బాండ్లపై ఆధారపడుతుంది. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.80 లక్షల కోట్ల నికర మార్కెట్‌ రుణ సమీకరణలు జరపాలని 2020–21 బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్దేశించారు. అయితే కరోనా ప్రభావంతో ఈ మొత్తాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం మేలో నిర్ణయించింది. 2019–20లో కేంద్ర రుణ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top