ఎగుమతులు ‘రివర్స్‌’లోనే..

Exports contract marginally to USD 25.98 billion in November - Sakshi

నవంబర్‌లో మైనస్‌ 0.34 శాతం క్షీణత

వరుసగా నాలుగో నెలలోనూ తిరోగమనం

విలువ రూపంలో 25.98 బిలియన్‌ డాలర్లు

దిగుమతులూ క్షీణతలోనే...

విలువ 38.11 బిలియన్‌ డాలర్లు

వెరసి వాణిజ్యలోటు 12 బిలియన్‌ డాలర్లు  

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా నాల్గవ నెలా నిరాశనే మిగిల్చాయి. అసలు వృద్ధిలేకపోగా –0.34 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతుల విలువ 25.98 బిలియన్‌ డాలర్లు. ఇక దిగుమతులూ క్షీణ బాటలో ఉన్నాయి. –12.71 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి దిగుమతుల విలువ 38.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 12.12 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2018 నవంబర్‌లో వాణిజ్యలోటు 17.58 బిలియన్‌ డాలర్లు.   కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...

► పెట్రోలియం (–13.12 శాతం), రత్నాలు– ఆభరణాలు(–8.14 శాతం), పండ్లు–కూరగాయలు (–15.10%), తోలు ఉత్పత్తులు (–5.29%), రెడీమేడ్‌ దుస్తుల (–6.52 శాతం) ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాలేదు.  ఎగుమతులకు సంబంధించి దాదాపు 30 కీలక రంగాల్లో 17 క్షీణతను నమోదుచేసుకున్నాయి.  

► పసిడి దిగుమతులు నవంబర్‌లో 6.59 శాతం ఎగబాకాయి.  2.94 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.  

► చమురు దిగుమతులు – 18.17% పడిపోయి 11.06 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతుల విలువ 10.26 శాతం తగ్గి 27.04 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  

ఎనిమిది నెలల్లోనూ క్షీణత...: కాగా, ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ చూస్తే, ఎగుమతులు 1.99 శాతం పడిపోయి 211.93 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 8.91 శాతం పడిపోయి 318.78 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

సేవల ఎగుమతుల్లో 5 శాతం వృద్ధి
ఇదిలావుండగా, అక్టోబర్‌లో సేవల ఎగుమతులు 5.25 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఈ ఎగుమతులు 17.70 బిలియన్‌ డాలర్లు. అయితే ఎగుమతుల విలువ మాత్రం దాదాపు యథాతథంగా 10.86 బిలియన్‌ డాలర్లుగా ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.

2018 అక్టోబర్‌లో సేవల ఎగుమతుల విలువ 16.82 బిలియన్‌ డాలర్లు. దిగుమతుల విలువ 10.10 బిలియన్‌ డాలర్లు. భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల వాటా దాదాపు 55 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.   

ఇబ్బందిగానే ఉంది..
2019 నవంబర్‌లో ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో వృద్ధి 6.32 శాతంగా ఉంది. అయితే మొత్తంగా చూస్తే, విదేశీ వాణిజ్య పరిస్థితులు సవాళ్లమయంగా కనిపిస్తోంది. ప్రపంచమార్కెట్లో మరింతగా పోటీపడేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం.  

– రవి సింఘాల్, ఈఈపీసీ ఇండియా చైర్మన్‌

ఆర్థిక వ్యవస్థలో బలహీనత
గణాంకాలు చూస్తుంటే, ఆర్థిక వ్యవస్థలో బలహీన డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఆయిల్, రవాణా తదితర పరికరాల దిగుమతులు క్షీణతలో ఉండడం ఇక్కడ గమనార్హం.  

– అదితి నాయర్, ఐసీఆర్‌ఏ ప్రిన్సిపల్‌ ఎకనమిస్ట్‌  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top