పన్ను ఆదా కోసం ఈక్విటీ పథకం

Equity scheme for tax saving - Sakshi

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌96

న్యూఢిల్లీ: అధిక రిస్క్‌ తీసుకునేందుకు సంసిద్ధులై ఉండి, దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్న వారు, అదే సమయంలో పన్ను ఆదా చేసుకోవాలనుకుంటే అందుకు ఆదిత్య ‘బిర్లా సన్‌ లైఫ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌ 96’ ఓ ఎంపిక అవుతుంది. ఇదొక ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌). ఇందులో రూ.1.5 లక్షల పెట్టుబడులపై ఓ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకి న్‌ పీరియడ్‌ ఉంటుంది. పనితీరులో ఈ పథకం బెంచ్‌మార్క్‌ కంటే ముందుండడం ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. సెబీ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ట్యాక్స్‌ సేవింగ్స్‌ పథకా న్ని ఇందులో విలీనం చేసింది. ఎందుకంటే విలీనం చేసిన పథకం నిర్వహణలోని ఆస్తులు కేవలం రూ.27 కోట్లే. ఏబీఎస్‌ఎల్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌96 పథకం నిర్వహణలో రూ.6,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 

పనితీరు 
ఈ పథకం రాబడులకు ప్రామాణిక సూచీ బీఎస్‌ఈ 200. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 14.4 శాతం అయితే, బెంచ్‌ మార్క్‌ రాబడులు 13.4 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో 12.9 శాతం, ఐదేళ్లలో 24.5 శాతం చొప్పున వార్షిక రాబడులను ఏబీఎస్‌ఎల్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌96 పథకం అందించింది. ఇక బెంచ్‌ మార్క్‌ రాబడులు మూడేళ్ల కాలంలో 12.1 శాతం, ఐదేళ్లలో 18.4 శాతంగా ఉన్నాయి. దీర్ఘకాలంలో చూసుకుంటే ఈ పథకం పనితీరు పోటీ పథకాలైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ ట్యాక్స్‌ సేవర్, ఫ్రాంక్లిన్‌ ఇండియా ట్యాక్స్‌ షీల్డ్‌ పథకాల కంటే కూడా మెరుగ్గా ఉంది. 2012, 2014, 2017 మార్కెట్‌ ర్యాలీల సమయాల్లోనూ మంచి పనితీరును చూపించింది. అన్ని వేళలా దాదాపు 95 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లోనే కొనసాగిస్తుంటుంది. మల్టీక్యాప్‌ విధానంలో అన్ని రకాల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కలిగిన స్టాక్స్‌ మధ్య పెట్టుబడులను విభజిస్తుంది. మరో ముఖ్యమైన విషయం 2006 నుంచి ఈ పథకాన్ని అజయ్‌గార్గ్‌ అనే ఫండ్‌ మేనేజరే నిర్వహిస్తుండడం. సూక్ష్మదృష్టితో స్టాక్స్, రంగాలను ఎంపిక చేసుకోవడం ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండడానికి కారణం. పోర్ట్‌ఫోలియోలోని సుందరం క్లేటాన్, గిల్లెట్‌ ఇండియా మల్టీబ్యాగర్‌ రాబడులను ఇచ్చాయి. అలాగే, హానీవెల్‌ ఆటోమేషన్స్‌ కూడా. ఈ స్టాక్‌లో ఇప్పటికీ ఐదు శాతానికి పైగా పెట్టుబడులను కలిగి ఉంది. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌లో పెట్టుబడులు ర్యాలీ సమయాల్లో రాబడుల ఆర్జనకు మద్దతుగా నిలిచాయి. 

పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం మొత్తం పెట్టుబడుల్లో 97 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఇటీవలి కాలంలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో కరెక్షన్‌ చోటు చేసుకున్నప్పటికీ, ఆయా విభాగాల్లోని పెట్టుబడులను కదిలించకుండా అలాగే కొనసాగించింది. ప్రస్తుతం మిడ్‌ క్యాప్స్‌లో 23 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉండడం వల్ల కరెక్షన్‌ చోటు చేసుకున్నప్పటికీ రికవరీకి అవకాశం ఉంటుంది. ఒకవేళ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ ర్యాలీ మొదలైతే ఎక్కువగా ప్రయోజనం పొందనుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top