గిఫ్ట్‌లకు జీఎస్టీ మోతమోగుతోంది జాగ్రత్త!

గిఫ్ట్‌లకు జీఎస్టీ మోతమోగుతోంది జాగ్రత్త!


జీఎస్టీ.. జీఎస్టీ ఎక్కడ చూసినా దేశంలో ఇప్పుడు ఈ పేరే మోతమోగుతోంది. ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ ఉంది? ఏ వస్తువును కొంటే జీఎ‍స్టీ భారం నుంచి తప్పించుకోవచ్చు? అని వినియోగదారులు తెగ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈ జీఎస్టీ భారం ఇక కంపెనీల నుంచి ఉద్యోగులు పుచ్చుకునే గిఫ్ట్‌లకు తాకనుంది. 50వేల రూపాయలకంటే ఎక్కువ విలువ కలిగిన బహుమతులన్నింటికీ జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. సోమవారం రోజు ఈ విషయాన్ని స్పష్టీకరించింది. వ్యాపారాలను ప్రమోట్‌ చేసుకోవడానికి లేదా ఉద్యోగులకు పరిహారాల కింద కంపెనీలు ఎంతో ఖరీదైన బహుమతులను ఇస్తుంటాయి.


ప్రస్తుతం వీటిని పన్ను పరిధిలోకి తెస్తున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. ఎలాంటి పరిశీలన లేని రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో బహుమతులు వీటి కిందకు వస్తాయని పేర్కొంది. రూ.50వేలు వరకు ఉన్న బహుమతులకు మాత్రం ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నామని తెలిపింది. అదేవిధంగా ఉద్యోగి, కంపెనీకి మధ్యలో ఉన్న లావాదేవీలకు, డీలింగ్స్‌కు ఎలాంటి సమయాల్లో జీఎస్టీ వర్తిస్తుందో కూడా క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఉద్యోగులకు ఉచితంగా హెల్త్‌ సెంటర్‌ సర్వీసులను అందిస్తే అది జీఎస్టీ పరిధిలోకి రాదని చెప్పింది. అదేవిధంగా కాంట్రాక్ట్‌ పార్ట్‌ కంపెనీ వ్యయాల కింద ఉద్యోగులకు ఉచితంగా గృహవసతి కల్పిస్తే అది కూడా జీఎస్టీ వెలుపలే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.  ఈ నెల 1 నుంచి దేశమంతా జీఎస్టీ పన్ను విధానంలోకి మారిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top