యస్‌ ఖాతాదారులకు కాస్త ఊరట

EMI And Credit Card Payment Through Other Bank Accounts By Yes Bank Customers - Sakshi

ఇన్‌వార్డ్‌ ఐఎంపీఎస్, నెఫ్ట్‌ సేవల పునరుద్ధరణ

ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు చెల్లింపులకు ఓకే  

న్యూఢిల్లీ: మారటోరియం వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని సర్వీసులను యస్‌ బ్యాంక్‌ క్రమంగా పునరుద్ధరిస్తోంది. తాజాగా ఇన్‌వార్డ్‌ ఐఎంపీఎస్, నెఫ్ట్‌ సర్వీసులను పునరుద్ధరించినట్లు మంగళవారం మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో వెల్లడించింది. దీంతో యస్‌ బ్యాంక్‌ నుంచి క్రెడిట్‌ కార్డులు, రుణాలు తీసుకున్న వారు ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం తమ ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, ఇతర ఏటీఎంల నుంచి కూడా నిర్దిష్ట స్థాయిలో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ యస్‌ బ్యాంక్‌ తెలిపింది. సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నెలరోజుల మారటోరియం విధించడంతో కస్టమర్లలో ఆందోళన నెలకొంది. నగదు విత్‌డ్రాయల్‌పై ఆంక్షలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫాంల ద్వారా డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలు కూడా నిల్చిపోవడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఫారెక్స్‌ సర్వీసులు, క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడింది.

యస్‌ బ్యాంక్‌లో టియర్‌ 1 బాండ్లేమీ లేవు: శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ 
నిధుల కొరతతో సతమతమవుతున్న యస్‌ బ్యాంక్‌లో తమకు టియర్‌ 1 స్థాయి బాండ్లేమీ లేవని శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ (ఎస్‌టీఎఫ్‌సీ) సంస్థ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. అప్పర్‌ టియర్‌ 2 స్థాయి బాండ్లలో 2010లో ఇన్వెస్ట్‌ చేసిన రూ. 50 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని పేర్కొంది. ఆర్‌బీఐ రూపొందించిన పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం.. సుమా రు రూ. 10,800 కోట్ల టియర్‌ 1 బాండ్ల చెల్లింపులు రద్దు కానున్న సంగతి తెలిసిందే. మరో వైపు, 2006లో జారీ చేసిన వారంట్లకు సంబ ంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తమపై రూ. 5 కోట్ల జరిమానా విధించినట్లు ఎస్‌టీఎఫ్‌సీ తెలిపింది. ప్రస్తుతం తమ గ్రూప్‌లో భాగమైన శ్రీరామ్‌ హోల్డింగ్స్‌ (మద్రాస్‌) (ఎస్‌హెచ్‌ఎంపీఎల్‌) అప్పట్లో రూ. 244 కోట్ల సమీకరణ కింద ఒక ప్రవాస భారతీయ వ్యక్తి నుంచి కూడా నిధులు సమీకరించినట్లు వివరించింది. ఈ లావాదేవీలో విదేశీ మారక నిర్వహణ (ఫెమా) చట్టాల ఉల్లంఘన జరిగింద న్న ఆరోపణలతో ఈడీ తాజా జరిమానా విధిం చినట్లు ఎస్‌టీఎఫ్‌సీ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top