హార్లిక్స్‌ రేసులో కోకకోలా

Coca-Cola in race to buy Horlicks from GlaxoSmithKline - Sakshi

390 కోట్ల డాలర్లకు విక్రయించాలని జీఎస్‌కే యోచన  

న్యూఢిల్లీ: మాల్ట్‌ ఆధారిత హెల్త్‌ డ్రింక్‌ హార్లిక్స్‌ కొనుగోలు రేసులో తాజాగా కోక–కోలా కూడా చేరింది. గ్లాక్సో స్మిత్‌లైన్‌ (జీఎస్‌కే) కంపెనీ హార్లిక్స్‌ బ్రాండ్‌ను భారత్‌లో విక్రయానికి పెట్టింది. ఈ 145 ఏళ్ల బ్రాండ్‌ను 390 కోట్ల డాలర్లకు (300 కోట్ల పౌండ్లు)విక్రయించాలని జీఎస్‌కే యోచిస్తోందని ఇంగ్లాండ్‌కు చెందిన సండే టెలిగ్రాఫ్‌ వెల్లడించింది. హార్లిక్స్‌ బ్రాండ్‌ను చేజిక్కించుకోవడానికి అంతర్జాతీయ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థలు–నెస్లే, క్రాఫ్ట్‌ హీంజ్‌ తదితర సంస్థలు పోటీపడుతున్నాయి.

ఇప్పుడు తాజాగా కోక–కోలా కూడా ఈ రేసులో చేరిందని సమాచారం. కాగా ఊహాజనిత వార్తలపై వ్యాఖ్యానించకూడదనేది తమ విధానమని కోకకోలా కంపెనీ పేర్కొంది. అమెరికాకు చెందిన కోక–కోలా కంపెనీ ఇటీవలనే ఇంగ్లాండ్‌కు చెందిన కోస్టా కాఫీ చెయిన్‌ను 500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కాగా హార్లిక్స్‌ కోక–కోలా పరమైతే కోకకోలా కంపెనీకి ఇది భారత్‌లో రెండో అతి పెద్ద కొనుగోలు అవుతుంది. గతంలో కోకకోలా కంపెనీ థమ్సప్, లిమ్కా, గోల్డ్‌స్పాట్‌ బ్రాండ్‌లను కొనుగోలు చేసింది.  

హార్లిక్స్‌ విక్రయం ఎందుకంటే...
నోవార్టిస్‌ కంపెనీకి చెందిన కన్సూమర్‌ హెల్త్‌కేర్‌ వ్యాపారంలో 36.5 శాతం వాటాను కొనుగోలు చేయాలని జీఎస్‌కే నిర్ణయించింది. ఈ వాటాను 920 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేయనున్నది. ఈ కొనుగోలుకు కావలసిన నగదును సమకూర్చుకోవడం కోసం జీఎస్‌కే కంపెనీ హార్లిక్స్, ఇతర బ్రాండ్లను విక్రయిస్తోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top