చందాకొచర్‌ నుంచి రూ.9 కోట్లు వెనక్కి..! | Chanda Kochhar may have to return over Rs 9 crore bonus to ICICI | Sakshi
Sakshi News home page

చందాకొచర్‌ నుంచి రూ.9 కోట్లు వెనక్కి..!

Feb 1 2019 4:38 AM | Updated on Feb 1 2019 4:38 AM

Chanda Kochhar may have to return over Rs 9 crore bonus to ICICI - Sakshi

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్‌ సుమారు రూ.9 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను కోల్పోనున్నారు. వీడియోకాన్‌ గ్రూపునకు రుణాల జారీలో కొచర్‌ బ్యాంకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ట కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో, కొచర్‌ను తొలగించినట్టేనని, ఆమెకు గతంలో ఇచ్చిన బోనస్‌లు, పెండింగ్‌లో ఉన్నవి, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను సైతం రద్దు చేస్తామని బ్యాంకు బుధవారమే ప్రకటించింది. బోనస్‌లతోపాటు అన్‌ఎక్సర్‌సైజ్డ్‌ స్టాక్‌ ఆప్షన్లను కూడా వదులుకోవాల్సి ఉంటుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి.

2009 మే నెలలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా నియమితులైన కొచర్, తనపై ఆరోపణల కారణంగా గతేడాది పదవికి రాజీనామా చేశారు. గత రెండేళ్లకు సంబంధించి కొచర్‌కు ఇవ్వదలిచిన పనితీరు ఆధారిత బోనస్‌లకు ఆర్‌బీఐ ఆమోదం తెలియజేయలేదని, దీంతో ఈ బోనస్‌లను కొచర్‌కు ఇచ్చినట్టు పరిగణించబోమని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, కొచర్‌కు ఇప్పటిదాకా బ్యాంకు 94 లక్షల షేర్లను(స్టాక్‌ ఆప్షన్స్‌) బ్యాంకు మంజూరు చేసింది.  వీటిలో ఎన్ని ఆమె వినియోగించుకున్నారనే సమాచారం లేదు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం చందాకొచర్‌కు ముట్టిన ఆర్థిక ప్రయోజనాలు రూ.340 కోట్ల మేర ఉంటాయని బ్యాంకు వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement