వృద్ధి రికవరీ సంకేతాలివిగో..!

వృద్ధి రికవరీ సంకేతాలివిగో..!


భారత ఆర్థిక రంగానికి సంబంధించి తాజాగా వెలువడిన గణాంకాలు ‘వ్యవస్థలో రికవరీ’ని సూచిస్తున్నాయి. ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి మూడేళ్ల గరిష్టస్థాయిని నమోదుచేసుకుంటే... సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.41 శాతంగా ఉంది. అయితే ఈ రేటు ఆగస్టులో 3.74 శాతం. పండుగల సీజన్, వ్యవస్థలో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్ప పెరుగుదలకు దారితీసినా... ఈ రేటు రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత స్థాయిలో ఉండడం హర్షణీయమని నిపుణులు పేర్కొంటున్నారు. 2016 జనవరి నాటికి 5.8 శాతం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ అంచనావేస్తోంది.

 

ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి జోరు..

* 6.4 శాతం వృద్ధి రేటు

* మూడేళ్ల గరిష్ట స్థాయి

* తయారీ, మైనింగ్, కేపిటల్ గూడ్స్ చక్కటి పనితీరు

* ఆర్‌బీఐ అంచనా స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం

 

పరిశ్రమలు హ్యాపీ...

పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో మంచి పురోగతి సాధించింది. 2014 ఆగస్టు నెల విలువతో పోల్చిచూస్తే... 2015 ఆగస్టులో ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 6.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2014 ఆగస్టులో ఈ రేటు కేవలం 0.5 శాతం.  2012 అక్టోబర్ తరువాత (అప్పట్లో 8.4 శాతం) ఇంత స్థాయిలో (ప్రస్తుత 6.4 శాతం) వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం, అలాగే మైనింగ్, డిమాండ్‌కు ప్రతిబింబమైన భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి విభాగం కేపిటల్ గూడ్స్ రంగాలు చక్కటి పనితనాన్ని ప్రదర్శించడం మొత్తం ఉత్పత్తికి మంచి ఊపును ఇచ్చింది. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాలను కీలక రంగాల వారీగా పరిశీలిస్తే...

 

తయారీ: వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదయ్యింది. 2014 ఆగస్టులో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా -1.1 శాతం క్షీణతలో ఉంది. ఇక ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఈ రంగం వృద్ధి రేటు 2.0 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది.

 

కేపిటల్ గూడ్స్: పెట్టుబడులకు సంకేతమయిన ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 21.8 శాతంగా నమోదయ్యింది. 2014లో ఈ రంగం అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా 10 శాతం క్షీణతలో ఉంది. ఆర్థిక సంవత్సరం గడచిన ఐదు నెలల్లో ఈ రేటు 4.8 శాతం నుంచి 7.4 శాతానికి ఎగసింది.

 

మైనింగ్: వృద్ధి రేటు 1.2% నుంచి 3.8 శాతానికి ఎగసింది. ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో ఈ రేటు 2% నుంచి 1.2%కి పడింది.

 

విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి నిరాశ కలిగిస్తోంది. ఈ రేటు ఆగస్టులో 12.9 శాతం నుంచి 5.6 శాతానికి పడిపోతే ఐదు నెలల్లో 11.7 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది.

 

కన్జూమర్ గూడ్స్: ఆగస్టులో 6.2 శాతం క్షీణ (మైనస్) బాట నుంచి 6.8 శాతం వృద్ధి బాటకు మళ్లింది. ఇందులో డ్యూరబుల్స్ గూడ్స్ విభాగం కూడా 15 శాతం క్షీణ(-) బాట నుంచి 17 శాతం వృద్ధి బాట పట్టింది. నాన్-డ్యూరబుల్స్ విభాగంలో యథాయథంగా 0.4 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. ఈ మూడు కేటగిరీలనూ ఐదు నెలల కాలంలో చూస్తే... కన్జూమర్ గూడ్స్ 4.3 శాతం క్షీణత నుంచి 3 శాతం వృద్ధికి మళ్లింది. డ్యూరబుల్స్12.8 శాతం క్షీణత నుంచి 7.7 శాతం వృద్ధికి చేరింది. నాన్-డ్యూరబుల్స్ కేటగిరీలో మాత్రం వృద్ధి రేటు  1.9 శాతం నుంచి 0.1 శాతానికి  తగ్గింది.

 

ఐదు నెలల్లో...

కాగా ఐఐపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 3% నుంచి 4.1%కి పెరిగింది.

 

చర్యలు సత్ఫలితాలు: పరిశ్రమలు

ప్రభుత్వ చర్యలతో తయారీ రంగం వేగం పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయని, రానున్న కాలంలో ఈ వేగం మరింత పుంజుకునే అవకాశం ఉందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ తెలిపారు. అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

ఆర్థిక వ్యవస్థకు శుభవార్తలు: కేంద్రం

ఆర్థిక వ్యవస్థకు శుభవార్తలు అందుతున్నట్లు తాజా గణాంకాలపై చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. భారీగా పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి, తగిన స్థాయిలో ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, 36 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 

రిటైల్ ద్రవ్యోల్బణం 4.41 శాతం

సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.41 శాతంగా నమోదయ్యింది. ఆగస్టు రేటు కన్నా పెరగడానికి పానీయాలు, పప్పు దినుసుల ధరలు పెరగడం ప్రధాన కారణం. అయితే 2014 ఆగస్టు రేటు కన్నా (5.63 శాతం) 2015 ఆగస్టు రేటు తక్కువ కావడం గమనార్హం.  పప్పు ధాన్యాల ధరలు వార్షికంగా  చూస్తే... 30 శాతం ఎగశాయి.



విభాగాల వారీగా చూస్తే... ఆహారం- పానీయాల ద్రవ్యోల్బణం రేటు 4.29 శాతం ఎగసింది. ఈ విభాగంలో ప్రత్యేకించి కూరగాయల ధరలు అసలు పెరగలేదు.  దుస్తులు-పాదరక్షల విభాగంలో రేటు 6 శాతంగా ఉంది. గృహ వ్యయాలకు సంబంధించి ద్రవ్యోల్బణం 4.74 శాతంగా ఉంది. ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 5.42 శాతం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top