పారిశ్రామిక ఉత్పత్తి ఉసూరు!

Industrial growth slips to 4-month low of 4.5% in Sept - Sakshi

సెప్టెంబర్‌లో కేవలం 4.5% వృద్ధి

ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి

మైనింగ్, క్యాపిటల్‌ గూడ్స్‌ నీరసం

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్‌లో అంతంతమాత్రంగానే నమోదయ్యింది. వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా తాజా గణాంకాలు వెల్లడించాయి. అంటే 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 4.5 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్‌ రంగం, అలాగే భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల పేలవ పనితీరు సెప్టెంబర్‌లో మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపింది. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

2017 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 4.1 శాతం. ఆగస్టులో ఈ రేటు 4.6 శాతం. జూన్‌లో ఈ రేటు 6.9 శాతంకాగా, జూలైలో 6.5 శాతం. ఈ ఏడాది మేలో వృద్ధి రేటు 3.8 శాతం.  
సెప్టెంబర్‌లో మైనింగ్‌ రంగంలో అసలు వృద్ధిలేకపోగా –0.2 శాతం క్షీణించింది. 2017 ఇదే నెలలో ఈ రంగం 7.6% వృద్ధి రేటును నమోదుచేసుకుంది.  
అలాగే క్యాపిటల్స్‌ గూడ్స్‌ విషయంలోనూ ఇదే జరిగింది. సమీక్షా నెలలో 8.7 శాతం వృద్ధి రేటు–5.8 శాతం క్షీణ బాటకు మళ్లింది.  
 మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు మాత్రం 3.8 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 సానుకూలంగా ముగిశాయి. ప్రత్యేకించి ‘ఫర్నిచర్‌’ విభాగంలో వృద్ధి భారీగా 32.8 శాతం నమోదయ్యింది. 20.9 శాతంతో తదుపరి స్థానంలో దుస్తుల విభాగం ఉంది. అయితే ప్రింటింగ్‌ అండ్‌ రీప్రొడక్షన్‌ ఆప్‌ రికార్డెడ్‌ మీడియా విభాగంలో వృద్ధి భారీగా –12.9 శాతం క్షీణించింది. పొగాకు ఉత్పత్తుల విభాగంలో క్షీణత –7.3 శాతంగా ఉంది.  
విద్యుత్‌ ఉత్పత్తి సైతం 3.4 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది.  
కన్జూమర్‌ డ్యూరబుల్స్, కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌ వృద్ధిరేట్లు వరుసగా 5.2 శాతం, 6.1 శాతంగా నమోదయ్యాయి.  

ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య ఫర్వాలేదు...
కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌– సెప్టెంబర్‌ మధ్య (గత ఏడాది ఇదే కాలంతో పోల్చి) ఐఐపీ వృద్ధి రేటు 2.6 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది.  

మౌలికరంగం నెమ్మది!
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) దాదాపు 40.27 శాతం వాటా ఉన్న ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక రంగం వృద్ధి సెప్టెంబర్‌లో మందగించింది. 4.3 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 4.7 శాతం. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. క్రూడ్‌ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోవడం మొత్తం గ్రూప్‌పై ప్రభావం చూపింది.

ఈ నెల ప్రారంభంలో వచ్చిన ఈ గణాంకాల అనంతరం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే తాజా సెప్టెంబర్‌ ఐఐపీ ఫలితాలు వచ్చాయి. మొత్తం ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల్లో  ఎరువులు (2.5 శాతం),  సిమెంట్‌ (11.8 శాతం), విద్యుత్‌ (8.2 శాతం), బొగ్గు (6.4 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (2.5 శాతం), స్టీల్‌ (3.2 శాతం), క్రూడ్‌ ఆయిల్‌ (–4.2 శాతం), సహజవాయువు (–1.8 శాతం) ఉన్నాయి. అయితే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ఈ రంగాల వృద్ధి రేటు 3.2 శాతం నుంచి  5.5 శాతానికి పెరగడం గమనార్హం.

అక్టోబర్‌లో రిటైల్‌ ధరలు... కూల్‌!
3.31 శాతంగా నమోదు
ఏడాది కనిష్ట స్థాయి  

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్‌తో పోల్చితే 2018 అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.31 శాతం పెరిగిందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం గడచిన ఏడాది కాలంలో ఇదే తొలిసారి. కొన్ని నిత్యావసరాలు, పండ్లు, ప్రొటీన్‌ రిచ్‌ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాలను క్లుప్తంగాచూస్తే...

 2018 సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.7 శాతం. 2017 అక్టోబర్‌లో ఈ రేటు 3.58%.  
 తాజా సమీక్షా నెలలో ఫుడ్‌ బాస్కెట్‌ ధర పెరక్కపోగా 0.86% క్షీణించింది. సెప్టెంబర్‌లో 0.51% పెరుగుదల నమోదయ్యింది.  
 కూరగాయల ధరలు సెప్టెంబర్‌లో 4.15% పెరిగితే, అక్టోబర్‌లో – 8.06% తగ్గాయి.  
 ఫ్రూట్‌ బాస్కెట్‌ ధర సెప్టెంబర్‌లో 1.12 శాతం పెరిగితే, అక్టోబర్‌లో –0.35 శాతానికి తగ్గింది.
 గుడ్లు, పాలు సంబంధిత  ప్రొటీన్‌ రిచ్‌ ఉత్పత్తుల ధరలూ తగ్గాయి.
 ఇక ఫ్యూయల్, లైట్‌ విభాగానికి వస్తే, సెప్టెంబర్‌లో ఈ ద్రవ్యోల్బణం 8.47 శాతం ఉంటే, అక్టోబర్‌లో 8.55 శాతానికి పెరిగాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top