వ్యవ‘సాయమే’ వీరి వ్యాపారం! | Agriculture is their business! | Sakshi
Sakshi News home page

వ్యవ‘సాయమే’ వీరి వ్యాపారం!

Nov 17 2017 12:18 AM | Updated on Jun 4 2019 5:04 PM

Agriculture is their business! - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వ్యవసాయంలో ఇపుడు కూలీలే ప్రధాన సమస్య. సీజన్లో కూలీలు దొరకటమంటే మాటలు కాదు. దీంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వంటి యంత్ర పరికరాల వాడకం తప్పనిసరవుతోంది. అలాగని అందరూ వీటిని కొనగలరా? ఈ ప్రశ్నే ఇపుడు చాలా మంది యువతను ఇటు చూసేలా చేస్తోంది. చక్కని వ్యాపారావకాశంగా ఊరిస్తోంది. ఫలితం... వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చే సంప్రదాయం పెరుగుతోంది. అదీ కథ. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే కావడంతో వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. దీనినే స్థానిక యువత వ్యాపారంగా మలచుకుంటోంది. దీంతో రైతులకూ పెద్దగా పెట్టుబడి లేకుండానే ఆధునిక పరిజ్ఞానంతో ఉత్పాదకత మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తోంది. కంపెనీలు సైతం బ్యాంకులతో చేతులు కలిపి ఔత్సాహిక యువతకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే దేశంలో యంత్ర పరికరాలు, యంత్రాలు అద్దెకిచ్చే వ్యాపారం విలువ వార్షికంగా రూ.16,000 కోట్లపైనే మరి!!.

యంత్రాలు తప్పనిసరి...
కూలీలు గ్రామాలను విడిచి పట్టణాలకు వలస వెళ్లడం, ఉపాధి కోసం ఇతర రంగాలను ఎంచుకోవడంతో దేశంలో అన్నిచోట్లా కొరత ఉంది. దీంతో రైతులు రోటావేటర్, హార్వెస్టర్, కంబైన్స్, ట్రాన్స్‌ప్లాంటర్, ఫెర్టిలైజర్‌ స్ప్రెడర్, ష్రెడ్డర్, బేలర్, ముల్చర్, లోడర్, లెవెలర్, గైరోవేటర్, ఇంటర్‌ కల్టివేటర్‌ వంటి పరికరాలను ఆశ్రయించాల్సివస్తోంది. చాలా కంపెనీలు కొత్త యంత్రాల ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నా యి కూడా. దేశవ్యాప్తంగా ఏటా లక్ష రోటావేటర్లు అమ్ముడవుతున్నట్లు సమాచారం. 5,000 హార్వెస్టర్లు, 2,000 ట్రాన్స్‌ప్లాం ట ర్లు, 400 స్ట్రా బేలర్స్‌ కూడా విక్రయమవుతున్నాయి. ఇతర పరికరాల అమ్మకాలు లక్షల యూనిట్లలోనే ఉంటున్నాయి. దేశంలో ఏటా సుమారు 6 లక్షల ట్రాక్టర్లు కొత్తగా పొలం బాట పడుతున్నాయి.

అవ్యవస్థీకృత రంగంలోనే..: భారత్‌లో యంత్రాలు, యంత్ర పరికరాల అద్దె వ్యాపారం అత్యధికంగా అవ్యవస్థీకృత రంగంలోనే ఉంది. భారీ వ్యవసాయ యంత్రాల తయారీలో ఓ 10 కంపెనీల దాకా ఉన్నాయి. చిన్న యంత్రాల తయారీదీ ఇదే పరిస్థితి. అవ్యవస్థీకృత రంగంలో 1,000కి పైగా కంపెనీలుంటే వ్యవస్థీకృత రంగంలో పదికి మించి లేవని ‘కిసాన్‌ క్రాఫ్ట్‌’ చెబుతోంది. వరి, గోధుమ, మొక్కజొన్న, ధాన్యాల వంటి పంటలకు అత్యధికంగా యాంత్రికీకరణ అవసరమవుతోంది.

వ్యవసాయేతర కుటుంబాలే...
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా... ట్రింగో పేరుతో రెంటల్‌ బిజినెస్‌ చేస్తోంది. 2–3 నెలల అవసరానికి ట్రాక్టర్లు, యంత్రాలను కొనుగోలు చేయడం వృథా అన్న భావన చాలా మందికి ఉంటుందని, అందరు రైతులకూ వీటిని కొనుగోలు చేసే స్తోమత లేదని మహీంద్రా ఎండీ పవన్‌ గోయెంకా చెప్పారు. ఇలాంటి వారికి ట్రింగో పెద్ద ఉపశమనమన్నారు. యంత్రాలు సొంతానికి కొన్నా వీటి వినియోగం కొన్ని రోజులకే పరిమితమవుతోంది. మిగిలిన రోజులు మూలన పడుతున్నాయి. ఇటువంటి యజమానులు ఫ్రాంచైజీలుగా మారిపోయి తమవద్ద ఉన్న యంత్రాలను ట్రింగో ద్వారా అద్దెకు ఇస్తున్నారు. వాస్తవానికి యంత్ర పరికరాలను కొనుగోలు చేస్తున్నవారిలో అత్యధికులు వ్యవసాయేతర కుటుంబాలవారే కావటం విశేషం. తమ అమ్మకాల్లో 95 శాతం మంది వ్యవసాయేతర కుటుంబాలేనని జర్మనీకి చెందిన దిగ్గజ సంస్థ క్లాస్‌ అగ్రికల్చరల్‌ మెషినరీ ఎండీ మృత్యుంజయ సింగ్‌ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇక రెవ్‌గో, ఈఎం3 అగ్రి సర్వీసెస్, ఖేటి ఘాడీ, ఫార్‌మార్ట్‌ వంటి కంపెనీలూ యంత్రాల అద్దె వ్యాపారం, అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తున్నాయి.

ఇద్దరికీ ఉపయోగమే..
తక్కువ ధర ఉన్న చిన్న పరికరాలను రైతులు కొంటున్నారని కిసాన్‌ క్రాఫ్ట్‌ ఎండీ రవీంద్ర అగర్వాల్‌ చెప్పారు. తమ ఉత్పాదనలు అన్నింటికీ ధ్రువీకరణ ఉందని చెప్పారు. గుంటూరు గ్రామీణ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ద్వారా ఔత్సాహిక యువతకు రుణం ఇప్పిస్తున్నామని, శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు. దాదాపు అన్ని రాష్ట్రాలూ సబ్సిడీతో ప్రోత్సహిస్తున్నాయని వెల్లడించారు. పరికరాలు కొనుగోలు చేసే స్తోమత లేకున్నా అందుబాటు ధరలో అద్దెకు దొరకడం కలిసి వస్తోందని కడప జిల్లా జమ్మలమడుగు రైతు దూదేకుల కులాయప్ప తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement