యూరో తీరుతో నష్టాలు.. | again lost on Europe market rutes | Sakshi
Sakshi News home page

యూరో తీరుతో నష్టాలు..

Feb 9 2016 1:38 AM | Updated on Sep 3 2017 5:11 PM

యూరో తీరుతో నష్టాలు..

యూరో తీరుతో నష్టాలు..

యూరోప్ మార్కెట్ల నష్టాలు భారత స్టాక్ మార్కెట్‌ను కూడా సోమవారం నష్టాల్లో పడేశాయి.

♦ ఆద్యంతం ఒడిదుడుకులు
♦ 330 పాయింట్ల నష్టంతో 24,287కు సెన్సెక్స్
♦ 102 పాయింట్లు నష్టపోయి 7,387కు నిఫ్టీ


యూరోప్ మార్కెట్ల నష్టాలు భారత స్టాక్ మార్కెట్‌ను కూడా సోమవారం నష్టాల్లో పడేశాయి. దీంతో రెండు వరుస ట్రేడింగ్ సెషన్‌ల లాభాలకు బ్రేక్ పడింది. రూపాయి 30 పైసలు క్షీణించడం, చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 330 పాయింట్లు క్షీణించి 24,287 పాయింట్ల వద్ద,  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 102 పాయింట్లు (1.36 శాతం) నష్టపోయి 7,387 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్ రంగం సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాలపాలయ్యాయి.

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఎలా ఉంటాయోనన్న (మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి) అంచనాలతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 24,637 వద్ద స్వల్ప లాభాల్లోనే ప్రారంభమైంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా ఉన్నాయన్న వార్తలతో ప్రొరంభంలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 24,699 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత యూరోప్ మార్కెట్ల బలహీనత కారణంగా నష్టాల్లోకి జారిపోయింది. 24,197 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 330 పాయింట్ల (1.34 శాతం)నష్టంతో 24,287 పాయింట్ల వద్ద ముగిసింది.

లాభాల్లో ఉక్కు షేర్లు..:
ఉక్కు ఉత్పత్తులకు  కనీస దిగుమతి ధరను నిర్ణయించిన నేపథ్యంలో ఉక్కు కంపెనీల షేర్లకు లాభాలు కొనసాగాయి. భూషణ్ స్టీల్ 6.2 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 0.9 శాతం, టాటా స్టీల్ 0.2 శాతం చొప్పున పెరిగాయి.

అమెరికా, యూరప్ మార్కెట్ల పతనం
న్యూయార్క్/లండన్: అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, మరో మాంద్యం తప్పదేమోనన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూరోప్ మార్కెట్లు 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోగా, కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. లండన్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 ఇండెక్స్ 2.7 శాతం, జర్మనీ డ్యాక్స్ 3.42 శాతం, ఫ్రాన్స్ సీఏసీ 40 ఇండెక్స్ 3.3 శాతం చొప్పున నష్టపోయాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా స్టాక్ సూచీలు నాస్‌డాక్, డోజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్‌లు 2 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement