జీఎస్‌టీ తగ్గింపు ఎఫెక్ట్‌... నేటి నుంచి ఇవన్నీ చౌక!

23 goods and services to get cheaper from January 1 as reduced GST - Sakshi

న్యూఢిల్లీ: జనవరి ఒకటి నుంచి 23 వస్తుసేవలపై తగ్గించిన జీఎస్‌టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. డిసెంబర్‌ 22న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌లో 23 రకాల వస్తు సేవలపై జీఎస్‌టీ శ్లాబులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపుతో సామాన్యుడికి అవసరమైన పలు వస్తు సేవల ఖరీదు తగ్గనుంది. పన్ను తగ్గింపుతో సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌బ్యాంకులు, నిల్వచేసిన కూరగాయలు ఇకపై చౌకగా లభిస్తాయి.పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన జాబితాలో కప్పీలు, ట్రాన్స్‌మిషన్‌ షాఫ్ట్, పునర్వినియోగ టైర్లు, లిథియం అయాన్‌ పవర్‌ బ్యాంకులు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్‌లు, వీడియో గేమ్‌ పరికరాలున్నాయి.

దివ్యాంగుల ఉపకరణాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. సరకు రవాణా వాహనాల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియాన్ని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అత్యల్ప పన్ను శాతమైన 5 శాతం శ్లాబులోఊత కర్ర, ఫ్లైయాష్‌ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లను చేర్చారు. పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వం సమకూర్చే నాన్‌–షెడ్యూల్డ్, చార్టర్డ్‌ విమానాల సేవలపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పునర్వినియోగ ఇంధన ఉపకరణాలు, వాటి తయారీపై కూడా 5 శాతం పన్ను విధించారు. శీతలీకరించిన, ప్యాక్‌ చేసిన కూరగాయలతో పాటు రసాయనాలతో భద్రపరచిన, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. జన్‌ధన్‌ యోజన ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలను కూడా పన్ను పరిధి నుంచి తప్పించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top